కాంట్రాక్టర్లమీద అలవిమాలిన ప్రేమ కురిపిస్తూ… తతిమ్మా వారి మీద కన్నెర్ర చేయడం, కారాలు మిరియాలు నూరడం చంద్రబాబుకు కొత్త కాదు. ఇప్పుడు, తాను కాంట్రాక్టర్లుగా తయారు చేసిన వారి దోపిడీకి కత్తెర పడేసరికి సహించలేకపోతున్నారు. కన్నీళ్లు కారుస్తున్నారు. ఢిల్లీ దాకా సుదీర్ఘ పోరాట షెడ్యూలు ప్రకటిస్తున్నారు. ప్రజలు వాస్తవాన్ని గుర్తించకుండా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. జాతీయ ఉపాధిహామీ పథకం పనులు అనేవి.. గ్రామాల్లో కూలీ పనులు కరవై అగచాట్లు పడే పేదలకోసం ఉద్దేశించినవి.
కూలీల కడుపు నింపడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. కూలీల ద్వారా మాత్రమే ఈ పనులను చేయించాలనేది నిబంధన. అసలు పథకమే కూలీల కడుపు నింపడానికి ఉద్దేశించింది గనుక.. యంత్రాలతో పనులు చేయించరాదనేది నిబంధన. అయితే చంద్రబాబు కాలంలో ఉపాధిహామీ పనుల ముసుగులో విపరీతంగా దోచుకున్నారు. తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుల్ని చంద్రబాబు కాంట్రాక్టర్లుగా తయారుచేసారు. పొక్లయిన్లతో పనులు చేయించి.. ఉపాధిహామీ బిల్లులు పెట్టించారు. చేసిన పనుల లెక్కల్లోనూ అనేక అరాచకాలకు పాల్పడ్డారు.
నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలు పొక్లయిన్లతో పనులు చేయిస్తున్నారంటూ ఎన్ని వార్తలు, ఆరోపణలు వచ్చినా చంద్రబాబు ఖాతరు చేయలేదు. లోకేష్ ఆ శాఖకు మంత్రిగా ఉండగా.. ఇలాంటి అక్రమాలు వందల కోట్ల రూపాయల మేర జరిగినట్లుగా.. అనేక ఆరోపణలు వచ్చాయి. చేసిందంతా చేసి.. తాము తయారుచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదంటూ ఇప్పుడు జగన్ సర్కారు మీద పడి ఏడవడం చంద్రబాబుకే చెల్లింది. ఇంకాకలిపి.. వారికి రావలసిన బిల్లులు ఏ కాలానికి సంబంధించినవి? జూన్ తర్వాత ఉపాధి పనులు చేసి బిల్లులు రాని స్థితిలో వారు ఉన్నారా? అప్పుడు జగన్ ప్రభుత్వం మీద ఎంత పోరాడినా అర్థముంది.
ఈ దోపిడీ నయా కాంట్రాక్టర్ల దళాలకు.. చంద్రబాబు అధికారంలో బిల్లులు ఇవ్వకుండా బిగబట్టారు. వారెవ్వరూ పార్టీ మారిపోకుండా.. ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో భయంగా పనిచేసేలా బెదిరించడానికి బిల్లులు ఆపేయడం అనేది ఒక అస్త్రంగా వాడుకున్నారు. ఎంతచేసినా… పార్టీ పరాజయం పాలైంది. ఇప్పుడు వారందరినుంచి చంద్రబాబు మీద ఒత్తిడి పెరుగుతోంది. దాంతో.. వారికి బిల్లులు వచ్చేదాకా ఢిల్లీ వెళ్లి పోరాడుతానంటూ చంద్రబాబు నిస్సిగ్గుగా ఒక పోరాట ప్రణాళిక ప్రకటిస్తున్నారని… అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.