పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇలా చేయాలి!

కర్నూలులోని రెసిడెన్షియల్ స్కూల్లో 2017లో బాలిక దుర్మరణం పాలైంది. అది ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక తల్లిదండ్రులు పార్వతి, రాజునాయక్ మాత్రం.. తమ కూతురు పలుమార్లు అత్యాచారానికి గురైనట్లుగా పోస్టుమార్టం నివేదికలో…

కర్నూలులోని రెసిడెన్షియల్ స్కూల్లో 2017లో బాలిక దుర్మరణం పాలైంది. అది ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక తల్లిదండ్రులు పార్వతి, రాజునాయక్ మాత్రం.. తమ కూతురు పలుమార్లు అత్యాచారానికి గురైనట్లుగా పోస్టుమార్టం నివేదికలో వచ్చిందని, దాన్ని పట్టించుకోకుండా.. పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేశారని ఆరోపిస్తున్నారు. వారి వాదన నిజమైతే గనుక.. అది చాలా ఘోరం, హేయం. నిందితులు ఎంతటి వారైనా.. కఠినంగా శిక్షించి తీరాల్సిందే.

చాన్నాళ్లుగా ఈ విషయంలో పోరాడుతున్న బాలిక తల్లిదండ్రులు.. మంగళగిరి జనసేన కార్యాలయంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిసి తమగోడు వెళ్లబోసుకున్నారు. జరిగిన ఘోరాన్ని మొత్తం ఆయనకు వివరించారు. అయితే ప్రజలకోసం మడమ తిప్పకుండా పోరాడతానని చెప్పుకునే పవన్ స్పందన మాత్రం చాలా మొక్కుబడిగా ఉంది. కేసును సమగ్రంగా విచారించి బిడ్డ తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన ముఖ్యమంత్రి జగన్ కోరారు. న్యాయం చేయకుంటే.. వ్యక్తిగతంగా మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని కూడా బెదిరించారు.

ఒక బాలిక ఘోరమైన అన్యాయానికి గురైంది. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం న్యాయం చేయడానికి పట్టించుకోవడం లేదు… ఇదీ ఆరోపణ. ప్రజల తరఫున పోరాడుతానని చెప్పుకునే ఒక నాయకుడు స్పందించాల్సిన తీరు ఇదేనా? ఇంతటితో సరిపోతుందా? ముఖ్యమంత్రిని కోరుతున్నట్లుగా పవన్ ఒక ప్రకటన విడుదల చేశారు. అంతే తప్ప.. ఆయన స్వయంగా ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాయడం కూడా జరగలేదు.

ఈ ప్రకటన చదివి ముఖ్యమంత్రి స్పందించాలని కోరుకుంటున్నారా? అయినా 2017 నాటి అత్యాచారం హత్య గురించి.. పోలీసులు ఇన్నాళ్లుగా కళ్లు మూసుకుని కబోదుల్లా దుర్మార్గంగా వ్యవహరిస్తే.. పవన్ ‘ముఖ్యమంత్రిని కోరడంతో’ న్యాయం జరుగుతుందా? ప్రభుత్వం స్పందించకుంటే.. తాను వ్యక్తిగతంగా మానవహక్కుల సంఘానికి ఫిర్యాదుచేస్తా’ అంటూ అదేదో మహోపకారం చేస్తున్నట్లుగా పవన్ బిల్డప్ ఇచ్చారు. నిజంగానే పవన్ కు చిత్తశుద్ధి ఉంటే గనుక.. ఆయన చేయాల్సింది అది కాదు.

ఎక్కడైతే అన్యాయం జరిగిందో.. అత్యాచారం-హత్య స్థానే ఎక్కడైతే ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ తప్పుడు కేసు పెట్టారో.. అదే పోలీసు స్టేషన్ ఎదుట.. తాను స్వయంగా దీక్షకు కూర్చోవాలి. కేసును అత్యాచారం హత్యగా నమోదు చేసే వరకు తాను అక్కడినుంచి కదలనంటూ పట్టుపట్టాలి. పవన్ స్థాయి పెద్ద నాయకుడు అంతగా ఉద్యమిస్తే న్యాయం జరగకుండా ఏమవుతుంది? పార్వతి, రాజునాయక్‌ల విజ్ఞాపనలకు భయపడకపోవచ్చు గానీ.. పవన్ రంగంలోకి దిగితే.. పోలీసు యంత్రాంగం మెట్టు దిగి రాకుండా ఉండగలుగుతుందా?

నిజంగా న్యాయం చేయాలని ఉంటే.. పవన్ స్పందించాల్సిన పద్ధతి అది! అంతే తప్ప.. భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడుతున్నారంటూ.. ఒక ఊరేగింపు ప్లాన్ చేసినట్లుగా.. తాను ఏదో చేసేస్తున్నట్లుగా బిల్డప్ లు ఇవ్వడంతో సరిపెట్టుకోకుండా… నిజంగా అన్యాయానికి గురైన వారికి తాను ఎంత వరకైనా అండగా ఉంటానని నిరూపించాలంటే.. ఆయన స్వయంగా రంగంలోకి దిగాలి. ఇలాంటి పోరాటం వల్ల.. ప్రయోజనం జరిగేది ఒక కుటుంబానికే కదా.. తమ ఓటు బ్యాంకు ఎలా పెరుగుతుంది.. అనే సంశయం పవన్ దళాలకు ఉండొచ్చు.

కానీ.. ప్రయోజనం పొందేది ఒక్క కుటుంబమే అయినా.. పవన్ చిత్తశుద్ధి పోరాటపటిమ మీద లక్షల మందికి విశ్వాసం కలుగుతంది. పవన్ తన పోరాటంతో వారికి న్యాయం చేస్తే.. అది వృథా పోదు. ప్రజలు గుర్తిస్తారని ఆయన తెలుసుకోవాలి.

'మా' రచ్చ మాములూగా లేదుగా.. మొత్తం తిట్లే