“రిప్ హైపర్ ఆది”. సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హ్యాష్ ట్యాగ్ ఇది. హైపర్ ఆది చనిపోయాడు, హైపర్ ఆదికి రిప్, ఆయన ఆత్మకు శాంతి కలగాలి అంటూ.. సోషల్ మీడియాలో మెసేజ్ లు సర్క్యులేట్ అవుతున్నాయి. అసలు సంగతి ఏంటా అని ఆరా తీస్తే హైపర్ ఆది మరోసారి వైసీపీ వాళ్లకు మండే పని చేశాడు. గతంలో జబర్దస్త్ వేదికపై ఇలాంటి స్కిట్ లు వచ్చినప్పుడు కూడా ఆదికి వార్నింగ్ లు పడ్డాయి. కానీ మరోసారి మనోడు అలాంటి డైలాగ్స్ కొట్టాడు. వైసీపీ బ్యాచ్ కి బుక్కైపోయాడు.
మీ పార్టీ ఏది.. అని హైపర్ ఆది అడిగితే ఇద్దరు వ్యక్తులు మేం విన్నాం.. మేం ఉన్నాం.. అని చెబుతారు. దానికి హైపర్ ఆది మేం ఉండం అని జవాబిచ్చి వెళ్లిపోతాడు. ఢీ ప్రోగ్రామ్ లో జరిగిన ఈ ఎపిసోడ్ పై వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఆదిపై ట్రోల్స్ మొదలు పెట్టాయి. మేం ఉన్నాం – మేం విన్నాం అనే డైలాగ్ తో జగన్ ని విమర్శించారని, అసలు జగన్ పై కామెంట్ చేయడానికి హైపర్ ఆది రేంజ్ ఏంటని మండిపడుతున్నారు.
ఇటీవల మహేష్ బాబు సర్కారువారి పాట లో కూడా “నేను విన్నాను, నేను ఉన్నాను” అని హీరోతో డైలాగ్ చెప్పిస్తాడు దర్శకుడు పరశురామ్. విమర్శలు రాకమునుపే తాను వైఎస్ఆర్ అభిమానిని అని, అందుకే ఆ డైలాగ్ పెట్టానని కవర్ చేసుకున్నారాయన. కానీ ఇక్కడ హైపర్ ఆది మాత్రం దాన్ని వెటకారంగా వాడారు.
పవన్ ఫ్యాన్ అయితే మాత్రం..
గతంలో షకలక శంకర్ కూడా పవన్ కల్యాణ్ పై అభిమానంతో స్కిట్లు చేశారు, కానీ పక్కనోళ్లని ఎప్పుడూ తిట్టలేదు. హైపర్ ఆది కూడా పవన్ కల్యాణ్ అభిమానే, గతంలో జనసేన కండువా మెడలో వేసుకుని ప్రచారానికి వెళ్లినట్టు కూడా ఆయన ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. పోనీ హైపర్ ఆది జనసేనే అనుకుందాం, అంత మాత్రాన ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిపై సెటైర్లు వేసేంత చొరవ తీసుకోవడం మాత్రం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.
పోనీ అదే ఫ్లోలో కేసీఆర్ ని ఏమైనా తిట్టగలరా, ఒకవేళ ఆయన్ని విమర్శించినట్టు స్కిట్లు చేస్తే ఈటీవీ వాటిని టెలికాస్ట్ చేస్తుందా అంటే అనుమానమే. ఇక్కడ జగన్ ని విమర్శించడం ఈటీవీకి కూడా ఇష్టమే కాబట్టి, ఇలాంటి స్కిట్లను ప్రోత్సహించినట్టుంది. అందుకే వైసీపీ వాళ్లకి బాగా మండింది. హైపర్ ఆదిని ఓ రేంజ్ లో తగులుకున్నారు. ఆది ఫోన్ నెంబర్ షేర్ చేసుకుంటూ బూతు పురాణం మొదలు పెట్టారు.
అయితే మరీ ఇలా చనిపోయాడు, ఆత్మకు శాంతి కలగాలంటూ పోస్ట్ లు పెట్టడం మాత్రం కరెక్ట్ కాదనే వారు కూడా ఉన్నారు. స్కిట్ సంగతి ఏమో కానీ, ఆది మాత్రం టూమచ్ విమర్శలతో కొన్నిసార్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.