కెరీర్ లో ఎక్కువగా ప్రేమకథలే చేసిన సాయితేజ్, ట్రాక్ మార్చి చాన్నాళ్లయింది. రిపబ్లిక్ తో తన పంథా ఏంటో చెప్పకనే చెప్పాడు. ఈ క్రమంలో డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నాడు. ఇందులో భాగంగా కెరీర్ లో తొలిసారిగా సస్పెన్స్-థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు ఈ హీరో. సుకుమార్ స్వయంగా స్క్రీన్ ప్లే అందిస్తుండడంతో ఈ ప్రాజెక్టుకు క్రేజ్ పెరిగింది.
ఇప్పుడీ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతానికి రుద్రవనం అనే టైటిల్ అనుకుంటున్నారు. సినిమాలో రుద్రవనం అనే ఊరు ఉంటుంది. ఆ ఊరులో ఊహించని విధంగా హత్యలు, ఆత్మహత్యలు జరుగుతుంటాయి. వాటిని సాయితేజ్ ఎలా ఛేదించాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
నిజానికి ఇది కొత్త కాన్సెప్ట్ కానేకాదు. ఇంతకుముందు చాలామంది హీరోలు చేశారు. కాకపోతే సాయితేజ్ ఈ జానర్ లో చేయడం, స్వయంగా సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండడం ఈ ప్రాజెక్టుపై ఆసక్తిని రేకెత్తించాయి. సుకుమార్ దగ్గర రైటింగ్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. త్వరలోనే ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను ఎనౌన్స్ చేయబోతున్నారు. యాక్సిడెంట్ తర్వాత సాయితేజ్ స్టార్ట్ చేసిన సినిమా ఇదే.