అధికార పార్టీ వైసీపీ దారి తప్పి పయనిస్తోంది. తన ప్రభుత్వం చేయాల్సింది పక్కన పెట్టి, అనవసర సంగతులను నెత్తికెత్తుకుంది. ఇది ముమ్మాటికీ రాంగ్ డైరెక్షన్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి.
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్‌పై రాయడానికి వీల్లేనంత నీచంగా దూషించారు. పట్టాభి వ్యాఖ్యలను నిరసిస్తూ వైసీపీ ప్రతిచర్యకు దిగింది. ఈ ఘటనను రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.
తన పార్టీ కార్యాలయాలపై దాడుల్ని ప్రజల ముందుకు తీసుకెళ్లి జగన్‌ది రౌడీ ప్రభుత్వంగా చిత్రీకరించే క్రమంలో అన్ని రకాల అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఇందుకు కొనసాగింపుగా చంద్రబాబునాయుడు 36 గంటల దీక్షకు దిగారు.
ఇదే సందర్భంలో వైసీపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చర్యలకు వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టింది. జనాగ్రహం అనే పేరుతో వైసీపీ నిరసనలకు దిగింది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన చేపట్టింది. గురువారం కూడా దీక్షలు కొనసాగించడంపై రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
ఆల్రెడీ టీడీపీ ప్రభుత్వం 2019లో జనాగ్రహానికి గురి కావడం వల్లే అధికారం నుంచి దిగిపోయిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మళ్లీ జనాగ్రహం ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ జనాగ్రహానికి గురి కాకుండా జాగ్రత్తగా మసలు కోవాల్సి వుంటుంది. అదేంటో గానీ, ఏపీలో మాత్రం వైసీపీ రివర్స్‌లో ఆలోచించడం గమనార్హం.
తాను జనాగ్రహానికి గురి కాకుండా పాలన సాగించాలని వైసీపీ ప్రభుత్వానికి నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు హితవు చెబుతున్నారు. తాను ఏం చేస్తే ప్రజానుగ్రహాన్ని పొందుతాననో గ్రహించి వైసీపీ ప్రభుత్వం పాలన సాగించాలే తప్ప ఇలా ప్రతిపక్షం ట్రాప్‌లో పడి అభాసుపాలయ్యేలా నిరసనకు దిగడం ఏంటనే నిలదీతలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి.
తాను చేయాల్సిన అభివృద్ధి పనులు వదిలేని, ఇతరేతల కార్యక్రమాలపై వైసీపీ దృష్టి సారించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికార, ప్రతిపక్ష పార్టీల అధినేతలు బూతుల పురాణానికి స్వస్తి చెప్పి, సంస్కారవంతమైన రాజకీయాలకు తెరలేపాలని ప్రజానీకం కోరుకుంటోంది.