ఏపీలో ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని తపిస్తున్న భారతీయ జనతా పార్టీ తీరా పోలింగ్ కు సమయం దగ్గర పడేసరికి మాత్రం కేంద్ర ఎన్నికల కమిషన్ చుట్టూ తిరుగుతూ ఉంటోంది. ఆ మధ్య తిరుపతి ఎంపీ సీటు ఉప ఎన్నిక సమయంలో ప్రచార పర్వం సాగుతుండగానే బీజేపీ నేతలు సీఈసీ వద్ద తేలారు.
తిరుపతి ఉప ఎన్నిక ప్రక్రియను అర్ధాంతరంగా రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్ని పోలింగ్ కు సమయం దగ్గర పడే సమయంలో.. ఎన్నిక ప్రక్రియను రద్దు చేసి, మళ్లీ నోటిఫికేషన్ ను విడుదల చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది!
ఆ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నా తమదే విజయం అంటూ ఒకవైపు చెబుతూనే మరోవైపు ఉప ఎన్నిక ప్రక్రియను రద్దు చేయాలని బీజేపీ నేతలు సీఈసీకి కంప్లైంట్ చేశారు. ఆ విషయంలో బీజేపీ అభ్యంతరాలను పరిశీలించిన కేంద్ర ఎన్నికల కమిషన్ ఆ కంప్లైంట్ ను లైట్ తీసుకుంది. కేంద్రంలో బీజేపీ చేతిలోనే అధికారం ఉన్నా.. తమ అభ్యంతరాలతో తిరుపతి బై పోల్ ను అపించలేకపోయింది కమలం పార్టీ.
ఇక బద్వేల్ ఉప ఎన్నిక విషయంలో కూడా బీజేపీకి చాలా అభ్యంతరాలు ఉన్నట్టున్నాయి! ఇప్పటికే ఈ విషయంలో బీజేపీ నేతలు ఢిల్లీ లెవల్లో ఈసీకి ఫిర్యాదులు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఓటర్లను బెదిరిస్తున్నారట!
ఏపీ మంత్రులు బద్వేల్ లో మకాం పెట్టారట! ఈ అభ్యంతరాలన్నింటినీ బీజేపీ నేతలు ఈసీ వద్దకు తీసుకెళ్లారు. అలాగే ఏపీ బీజేపీ చీఫ్ మాట్లాడుతూ తక్షణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బద్వేల్ ను వీడాలట. వారంతా నియోజకవర్గం వదిలి వెళ్లిపోతే, తాము కూడా బద్వేల్ ను వీడి వెళ్లిపోతారట! మరి అంతా వెళ్లిపోతే ఇక ఉప ఎన్నిక సందడి ఏముంటుందో!
ఇంకోవైపు నియోజకవర్గం వ్యాప్తంగా బూత్ ల వారీగా బీజేపీ కి ఏజెంట్లను కూర్చోబెట్టడానికి ఆ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఉంది. ఆదినారాయణ రెడ్డి ఈ విషయంలో చాలా కష్టపడుతున్నట్టుగా ఉన్నాడు పాపం!
టీడీపీలోని తన పాతపరిచయాలను ఉపయోగించుకుని, వారిని బీజేపీ ఏజెంట్లుగా కూర్చోబెట్టేందుకు ఆది గట్టిగా కృషి చేస్తున్నట్టున్నారు. మరి ఏజెంట్లనే కూర్చోబెట్టుకోలేకపోతున్నారు కాబట్టి.. అక్రమాలు, బెదిరింపులు అనేయడం చాలా సులువు లాగుంది!