నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ ఎఫెక్ట్….టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ముందస్తు జాగ్రత్త తీసుకున్నారు. తనకు కూడా రఘురామకు మాదిరిగానే పోలీసు సత్కారం జరుగుతుందని భావించారు. దీంతో ఆయన పోలీసులను భయపెట్టి తనపై ఒంటిపై చేయి పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తోంది. అరెస్ట్ నేపథ్యంలో ఓ వీడియోను పట్టాభి విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రస్తుతం తన ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ఎంపీ రఘురామపై దాడి చేసిన విధంగా తనపై కూడా అలాంటి చర్యకే పాల్పడాలని పోలీసులు చూస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఏం జరిగినా కోర్టులో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుందని హెచ్చరించారు. పోలీసులు కస్టడీలోకి తీసుకున్న తర్వాత తనకు ఏం జరిగినా సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్‌దే బాధ్యత అని పట్టాభి అన్నారు.
పట్టాభి భార్య చందన మీడియాతో మాట్లాడుతూ తన భర్త ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారన్నారు. అలాగే తిరిగి రావాలని ఆమె కోరారు. తన భర్తకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని పట్టాభి చందన హెచ్చరించారు.
ఎక్కడైనా అరెస్ట్ నుంచి తప్పించుకు నేందుకు తమకు అనారోగ్యంగా ఉందని చెప్పడం చూశాం. కానీ రఘురామ ఎఫెక్ట్ వల్ల తాము ఆరోగ్యంగా ఉన్నామని చెప్పడం సరికొత్త మార్పునకు సంకేతం.
అంతేకాదు, తాము ఆరోగ్యంగా ఉన్నామంటూ వీడియో కూడా విడుదల చేయడం గమనార్హం. రఘురామ విషయంలో కస్టడీలో భౌతిక దాడికి సంబంధించి వివాదం సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే.
తనను కూడా రఘురామ ఆరోపిస్తున్నట్టు…కస్టడీలో కొడతారనే భయం పట్టాభిని వెంటాడుతున్నట్టు ఆయన విడుదల చేసిన వీడియోనే చెబుతోంది. ఈ నేపథ్యంలో కస్టడీలో పట్టాభి వ్యవహారం ఏ నాటకానికి దారి తీయనుందో మున్ముందు చూడాలి.