ఏపీలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బంద్ పిలుపుపై ఒకే మాటలో స్పందించారు మంత్రి కొడాలి నాని. చంద్రబాబు నాయుడు ఇచ్చిన బంద్ కాల్ కు కనీసం హెరిటేజ్ షాపులు కూడా పగలంతా మూయలేదని, మధ్యాహ్నం నుంచి చంద్రబాబు సొంత దుకాణాలను తలుపులు తెరిచి వ్యాపారం చేసుకున్నారని మంత్రి అన్నారు. ఇక తనదైన శైలిలో చంద్రబాబు నాయుడు తీరుపై విరుచుకుపడ్డారు కొడాలి నాని.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు బూతులు తిడుతున్నారు అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యానంపై కొడాలి నాని స్పందించారు. తను చంద్రబాబునాయుడును వ్యక్తిగత కక్షతో ఏమీ తిట్టడం లేదని, తను చెప్పే మాటలన్నీ చంద్రబాబుపై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఉపయోగించిన మాటలే అని నాని అంటున్నారు.
ఎన్టీఆర్ కు చంద్రబాబు ద్రోహం చేశాడని, ఆ ఆవేదనతో చంద్రబాబును ఎన్టీఆర్ తిట్టారని, అవే తను చెబుతున్నట్టుగా నాని చెప్పుకొచ్చారు. అలాగే పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి తిట్టే పని తాము పెట్టుకోమని, అయితే తెలుగుదేశం పార్టీ వాళ్లు మాత్రం పెయిడ్ ఆర్టిస్లులను పెట్టి తమను తిట్టిస్తుంటారని నాని అన్నారు.
ఏబీఎన్ చానల్ పెడితే ఆడవాళ్ల చేత కాల్స్ చేయించి తమను తిట్టిస్తారని, పట్టాభిలాంటి వాళ్లు జీతం కోసం తిడుతుంటారని అన్నారు. ఇక నాని ప్రసంగం అంతా ఆయన శైలిలోనే సాగింది. చంద్రబాబుపై ఏకవచన సంబోధనతోనే నాని ప్రసంగం సాగింది.
చంద్రబాబు నాయుడు ఇచ్చిన బంద్ కాల్ కు కనీసం హెరిటేజ్ కూడా మూయలేదని నాని చెప్పడం మాత్రం ఆసక్తిదాయకంగా ఉంది. టీడీపీ ఇచ్చిన బంద్ పిలుపుకు హెరిటేజ్ కూడా స్పందించకపోతే.. అంతకన్నా ఆ పిలుపు ప్రభావం గురించి చెప్పడానికి వేరే ఉదాహరణలు అక్కర్లేదేమో!