ఒక కేసు విచారణ విషయమై ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. సీఎస్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇటీవల కాలంలో జస్టిస్ దేవానంద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, డి.రమేశ్‌లను మద్రాస్, అలహాబాద్ హైకోర్టులకు బదిలీ చేయాలని గత నెల 24న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.
వీళ్లిద్దరి బదిలీలను నిలుపుదల చేయాలంటూ కొందరు హైకోర్టు న్యాయవాదులు నిరసనలకు దిగారు. రాష్ట్రపతి, కేంద్ర న్యాయశాఖ మంత్రి తదితర పెద్దలకు వాళ్ల బదిలీలను నిలుపుదల చేయాలని విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఇద్దరు న్యాయమూర్తుల గురించి చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ బదిలీ సిఫార్సు న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తుందని కొందరు న్యాయవాదులు అనడం గమనార్హం.
సదరు న్యాయమూర్తి బట్టు దేవానంద్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. జస్టిస్ ప్రశ్న, చీఫ్ సెక్రటరీ ఆన్సర్ అందరి దృష్టిని ఆకర్షించాయి. ఏపీ హైకోర్టులో అసలేం జరిగిందో తెలుసుకుందాం.
“మీరెక్కడ చదువుకున్నారో తెలియదు. కానీ అబ్దుల్‌కలాం, వెంకయ్యనాయుడు, నరేంద్ర మోదీ వంటి ప్రముఖులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారు. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వానికి ఎందుకంత చులకన భావన? “
“జీతాల కోసం ఉపాధ్యాయులు రోడ్డెక్కడం ఏపీ చరిత్రలో ఎప్పుడైనా చూశారా? ఇది దురదృష్టకర పరిస్థితి కాదా? జీతాల కోసం బెగ్గింగ్ నేనెప్పుడూ చూడలేదు. ఉపాధ్యాయులకు జీతాలివ్వరు కానీ, అక్రమ నిర్మాణాలకు రూ.40 కోట్ల బిల్లులు చెల్లిస్తారా?” అని సీఎస్‌ను హైకోర్టు జడ్జి ప్రశ్నించారు.
చీఫ్ సెక్రటరీ స్పందిస్తూ… “మా తండ్రి ఉపాధ్యాయుడే. నా చిన్నతనంలో మూడు నెలల జీతం కోసం ఆందోళన చేసిన సందర్భం వుంది” అని చీఫ్ సెక్రటరీ సమాధానం ఇచ్చారు. ఇదిలా వుండగా దేశ వ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థలు గత 20 ఏళ్లుగా ఎక్కువగా వస్తున్నాయి. అంతకు ముందు అన్ని చోట్లా ప్రభుత్వ బడులే దిక్కు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ ప్రభుత్వ బడుల్లోనే చదువుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి.
మరీ ముఖ్యంగా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి. నాడు-నేడు పేరుతో ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు పెంచుతున్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టారు. పేదలకు ఇంగ్లీష్ చదువు అందించి, ప్రపంచంతో పోటీ పడేస్థాయికి తీసుకెళ్లాలని జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఖర్చు చేస్తోంది. హైకోర్టు జడ్జి తాజా వ్యాఖ్యలతో ఇవన్నీ ఇప్పుడు చర్చకు వస్తున్నాయి.