దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

టాలీవుడ్ మరో గొప్ప నటుడ్ని కోల్పోయింది. నవరసాల్ని పలికించగల అద్భుత నటుడు కైకాల సత్యనారాయణ ఇక లేరు. ఈరోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. Advertisement వెండితెరపై నిండైన…

టాలీవుడ్ మరో గొప్ప నటుడ్ని కోల్పోయింది. నవరసాల్ని పలికించగల అద్భుత నటుడు కైకాల సత్యనారాయణ ఇక లేరు. ఈరోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 87 సంవత్సరాలు.

వెండితెరపై నిండైన రూపం కైకాల సత్యనారాయణ. ఎస్వీ రంగరావు తర్వాత ఆ స్థాయి అందుకున్న నటుడు ఆయన. 1935లో కృష్ణా జిల్లాలో జన్మించిన కైకాల, నాటకాల్లో రాణించారు. ఆ అనుభవంతో సినిమా వేషాల కోసం మద్రాసు వెళ్లారు. సిపాయి కూతురు అనే సినిమాలో చిన్న పాత్ర పోషించారు.

ఆ సినిమా ఫెయిల్ అయినపప్పటికీ సత్యనారాయణ అందర్నీ ఆకర్షించారు. నిండైన రూపం, కంచు కంఠం అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ పోలికలకు దగ్గరగా ఉండడం సత్యనారాయణకు కలిసొచ్చింది. ఈ విషయం గ్రహించిన ఎన్టీఆర్ కూడా ఆయనకు అవకాశాలిచ్చారు. చాలా సినిమాల్లో ఎన్టీఆర్ కు డూప్ గా కూడా నటించారు కైకాల.

కైకాల సత్యనారాయణ కెరీర్ ను మలుపుతిప్పిన వ్యక్తి విఠలాచార్య. తను తీసిన ఓ సినిమాలో విలన్ పాత్ర వేయించారు విఠలాచార్య. అదే సత్యనారాయణ కెరీర్ ను మలుపుతిప్పింది. అప్పట్నుంచి మెయిన్ స్ట్రీమ్ విలన్ గా స్థిరపడిపోయారాయన.

ఆ తర్వాత ఎస్వీ రంగారావు టైపులో ఎన్నో క్యారెక్టర్ రోల్స్ కూడా వేశారు. ఇంకా చెప్పాలంటే, ఎస్వీ రంగారావు లేని లోటును కైకాల దాదాపు భర్తీ చేయగలిగారు. సాంఘికాలతో పాటు.. పౌరాణిక పాత్రలైన రావణుడు, ధుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు లాంటి పాత్రల్ని కైకాల పోషించారు. పౌరాణికాల్లో రాముడు, కృష్ణుడు పాత్రలకు ఎన్టీఆర్ ఎలా స్థిరపడిపోయారో, అదే పౌరాణికాల్లో రాక్షస పాత్రలకు కైకాల అలా స్థిరపడ్డారు.

కేవలం నటుడిగానే కాకుండా.. నిర్మాతగా, రాజకీయనాయకుడిగా కూడా కైకాల విశేష ప్రతిభ కనబరిచారు. కొదమసింహం, ముద్దుల మొగుడు, బంగారు కుటుంబం లాంటి సినిమాలు నిర్మించింది ఈయనే. వీటిలో బంగారు కుటుంబం సినిమాకు నంది అవార్డ్ కూడా అందుకున్నారు. రఘుపతి వెంకయ్య అవార్డుతో పాటు మరెన్నో అవార్డులు అందుకొని, తెలుగు చిత్రసీమలో ఓ అధ్యాయాన్ని లిఖించారు కైకాల సత్యనారాయణ.

770కి పైగా సినిమాల్లో నటించి తనకుతానే సాటి అనిపించుకున్న కైకాల, వయసురీత్యా సినిమాలకు దూరమయ్యారు.