ఉట్టికెక్కకున్నా.. స్వర్గానికెక్కాలంటున్న బిజెపి

రాష్ట్రంలో వారు దక్కించుకోగల ఓటు శాతం 1-2 మధ్యలో ఉంటుందని గతంలో నిరూపణ అయింది. అక్కడినుంచి మరొక్కశాతం వరకు పెరిగారో లేదో తెలియదు! కొన్ని సంవత్సరాలుగా ఏదేదో రంకెలు వేస్తున్నప్పటికీ.. ప్రజలు వాళ్లను నమ్ముతున్నారో…

రాష్ట్రంలో వారు దక్కించుకోగల ఓటు శాతం 1-2 మధ్యలో ఉంటుందని గతంలో నిరూపణ అయింది. అక్కడినుంచి మరొక్కశాతం వరకు పెరిగారో లేదో తెలియదు! కొన్ని సంవత్సరాలుగా ఏదేదో రంకెలు వేస్తున్నప్పటికీ.. ప్రజలు వాళ్లను నమ్ముతున్నారో లేదో కూడా తెలియదు. 

కేంద్రంలో తాము ఏలుబడి సాగిస్తున్నాం గనుక.. రాష్ట్రానికి ‘ప్రత్యేకంగా’ ఏం వరాలు సాధించుకువచ్చారో కూడా తెలియదు. కానీ.. సీట్లు మాత్రం తామే గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సొదంతా ఏపీలో భారతీయ జనతా పార్టీ గురించే. గోదావరి జోన్ లో ఉన్న పార్లమెంటు స్థానాల్లో నాలుగింటిని తమ పార్టీనే గెలుచుకోవాలని లెక్కలు కడుతున్న ఆ పార్టీ అత్యాశ గురించి. 

భారతీయజనతా పార్టీ గోదావరి జోన్ నాయకుల సమావేశం తాజాగా జరిగింది. ఆ జోన్ లో మొత్తం నాలుగు పార్లమెంటు స్థానాలున్నాయి. కాకినాడ, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నరసాపురం ఉన్నాయి. ప్రస్తుతం ఈ నాలుగు స్థానాలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ నాలుగింటిలోనూ బిజెపి గెలిచి తీరాలని వాళ్లు డైలాగులు వల్లిస్తున్నారు. వారికి ఉన్న బలంతో పోల్చుకుంటే.. ఇలాంటి డైలాగులు తమను నవ్వుల పాలు చేస్తాయనే భయం కూడా సోము వీర్రాజు లాంటి వాళ్లకు ఉన్నట్టు లేదు. 

గత ఎన్నికల్లో బిజెపి ఆ నాలుగు నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీచేసి ఏం సాధించిందో ఓసారి గమనిస్తే.. నవ్వు తెప్పించే వివరాలు తెలుస్తాయి. కాకినాడ నియోజకవర్గంలో భాజపాకు 9,596 ఓట్లు వచ్చాయి. పోలైన మొత్తం 12 లక్షల పైచిలుకు ఓట్లలో అవి కేవలం 0.78 శాతం మాత్రమే. రాజమండ్రిలో 12,334 ఓట్లు అనగా.. 0.99 శాతం  ఓట్లు వచ్చాయి.అదే మచిలీపట్నం విషయానికి వస్తే వారికి లభించింది కేవలం 6481 ఓట్లు మాత్రమే. అంటే 0.52 శాతం. గోదావరి జోన్ మొత్తానికి కలిపి నరసాపురంలో మాత్రం వారికి అత్యధికంగా ఓట్లు లభించాయి. అక్కడ అదివరకటి రాష్ట్రప్రభుత్వంలో మంత్రిగా కూడా సేవలందించిన పైడికొండ మాణిక్యాల రావు పోటీచేశారు. ఆయనకు 12414 ఓట్లు దక్కాయి. ఇది మొత్తం పోలైన ఓట్లలో 1.05 శాతం! మొత్తం గోదావరిజోన్లో ఒక శాతం కంటె ఎక్కువ  ఓట్లు దక్కిన ఏకైక నియోజకవర్గం నర్సాపురం. 

ఈ మాత్రం ప్రజాదరణ, ఈ మాత్రం ఓటు బ్యాంకు పెట్టుకుని.. ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు గెలిచేయాలని ఆరాటపడడం చూస్తే.. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగబాకుతానందిట అనే సామెత ప్రతి ఒక్కరికీ గుర్తుకు వస్తుంది. తమ ఎన్నికల సీట్లు, వ్యూహరచన విషయానికి వచ్చినా సరే.. పవన్ కల్యాణ్ ను ఎన్నడో పట్టించుకోవడం మానేసిన బిజెపి.. ఇలాంటి పేరాశకు పోవడం మాత్రం కామెడీనే!