ఏపీ మంత్రిగా ఉన్న సమయంలో విశాఖ ఎయిర్ పోర్టులో నారాలోకేష్ బాబు పేరిట అయిన స్నాక్స్ బిల్లు పాతిక లక్షల రూపాయల వరకూ అయ్యిందని సమాచారం. విమానాశ్రమంలో వీఐపీలు గంటో, అరగంటో ఉంటారు. అలాంటి సమయంలోనే, అది కూడా విశాఖకు వెళ్లిన సందర్భాల్లోనే నారా లోకేష్ ఏకంగా పాతిక లక్షల రూపాయల విలువైన స్నాక్స్ మింగారంటే.. అసలు ఏం తిని ఉంటారబ్బా.. అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యపోతూనే ఉన్నారు!
ఎన్నో విలువైన విషయాల గురించి ట్వీట్లు చేసే నారాలోకేష్ బాబు తన పేరిట తిండి ఖాతా బకాయిల గురించి మాత్రం మాట్లాడటం లేదు. ఆ విషయంపై ట్వీట్లు వదలడం లేదు. ఒక్క విశాఖ ఎయిర్ పోర్టులో మాత్రమేనా.. లేక నారా లోకేష్ ఇంకా ఏయేచోట్ల ఎంత డబ్బులు బకాయిలు పెట్టి, ప్రభుత్వ ఖాతా నుంచి పే చేసేలా ఇంకా ఏమైనా తిన్నారా? అనే సందేహాలూ నెలకొని ఉన్నాయి.
గత ప్రభుత్వ హయాంలో నారా లోకేష్ స్నాక్స్ బిల్లులో పన్నెండు లక్షల రూపాయలు చెల్లించారట. ఇక మిగిలిన బిల్లు పదమూడు లక్షల రూపాయల వరకూ ఉందని సమాచారం. ఆ డబ్బులు చెల్లించాలంటూ.. ఏపీ ప్రభుత్వానికి హర్షవర్దన్ చౌదరికి చెందిన రెస్టారెంట్ నుంచి ఒత్తిడి వస్తోందట. అధికారులకు బిల్లులు పంపి.. ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ నారా లోకేష్ స్నాక్స్ బిల్లు కట్టమంటూ ఒత్తిడి చేస్తూ ఉందని సమాచారం.
నోరు తెరిస్తే నారా లోకేష్ చెప్పే నీతులకు హద్దుండదు. ఆయన మాటలు కోటలు దాటుతూ ఉంటాయి. తీరాచూస్తే ప్రభుత్వ ఖాతా నుంచి ఏకంగా పాతిక లక్షల రూపాయల స్నాక్స్ బిల్లు, అది కూడా విశాఖ విమానాశ్రయం ఖాతా మాత్రమే! ఇలాంటి అంశాల గురించి లోకేష్ ఎందుకు స్పందించరో మరి!