ఖమ్మంలో టీడీపీ విజయ శంఖారావం సభ వెనుక చంద్రబాబు కుయుక్తుల్ని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బయట పెట్టారు. తెలంగాణలో టీడీపీని వీడి వెళ్లిన నాయకులంతా తిరిగి పార్టీలోకి రావాలని, అందరం కలిసి పార్టీకి పూర్వవైభవం తీసుకొద్దామని ఖమ్మం వేదికగా చంద్రబాబు పిలుపు ఇవ్వడంపై సజ్జల రామకృష్ణారెడ్డి భలే మంచి ప్రశ్న సంధించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రకమైన పిలుపు చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదని సజ్జల రామకృష్ణారెడ్డి నిల దీశారు. తెలంగాణ కాంగ్రెస్‌లో స్లీపర్ సెల్‌లను చంద్రబాబు పెట్టారని సజ్జల విమర్శించారు. ఏపీలో బీజేపీతో బేరాలు ఆడేందుకే ఖమ్మంలో టీడీపీ సభ నిర్వహించినట్టు వుందన్నారు. బాబుకు ఆధార్ కార్డు, ఓటు కూడా తెలంగాణలోనే ఉన్నాయన్నారు. ఈ మధ్య మార్చుకున్నట్టున్నారని సజ్జల అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో సేవ చేయాలని అనుకున్నట్టు శుభం అన్నారు. దాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అలాగని రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు చేయాలని కూడా లేదన్నారు.
ఎన్నికలు వచ్చే సమయానికి వ్యాపారం చేసుకోవడం చంద్రబాబుకు బాగా అలవాటైన విద్య అని విమర్శించారు. ఇప్పుడు కూడా అదే ప్రదర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే చంద్రబాబు తెలంగాణకు వెళ్లాడన్నారు. అసలు చంద్రబాబుకు రాజకీయాలు ఎక్కడ చేయాలో స్పష్టత ఉందా? అని ప్రశ్నించారు. జగన్‌కు స్పష్టత వుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు సేవ చేయాలనే నిబద్ధత జగన్‌లో ఉండేదన్నారు.
ఆ తర్వాత విభజన కావడంతో ఏపీ వరకూ ఏం చేయాలో జగన్ స్పష్టంగా ఉన్నారని సజ్జల చెప్పుకొచ్చారు. తనకెలాంటి క్లారిటీ వుందో ముందు చంద్రబాబు చెప్పాలన్నారు. పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ప్రయోగం చేశారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి ప్రయోగమే బీజేపీతో చేయడానికి, తెలంగాణలో టీడీపీకి ప్రజాబలం ఉందని చెప్పుకోడానికే ఖమ్మంలో సభ పెట్టాడనే అభిప్రాయం తనకు కలుగుతోందన్నారు. ఇప్పుడు ఆ శంఖమే పూరించినట్టున్నారని సజ్జల వెటకరించారు.
ఖమ్మంలో చంద్రబాబు ప్రసంగం ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రెండు కళ్ల సిద్ధాంతం, పగలు ఒకమాట, రాత్రికి ఒక మాట, ఆ పార్టీ వద్ద ఒక మాట, ఈ పార్టీ వద్ద ఒకమాట మాట్లాడుతూ ఉన్నారని దెప్పి పొడిచారు. అలాంటి మాటలకు విలువ వుంటుందని తాను అనుకోవడం లేదన్నారు. ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటేనని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే చంద్రబాబు తెలంగాణ యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు.