వివాహంపై మారుతున్న భార‌తీయుల ధోర‌ణి!

వివాహంపై భార‌తీయుల ధోర‌ణి మారిపోతూ ఉంది. వివాహాన్ని జీవితంలో అత్యంత కీల‌క‌మైన‌ది, అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కమైన‌దిగా, వివాహంతోనే జీవితం ముడిప‌డిపోతుంది, వైవాహిక జీవితం లేక‌పోతే మ‌రేం లేదు, సంస్కృతి, సంప్ర‌దాయం, మూడుముళ్లు, ఏడ‌డుగులు.. అని ఘ‌నంగా…

వివాహంపై భార‌తీయుల ధోర‌ణి మారిపోతూ ఉంది. వివాహాన్ని జీవితంలో అత్యంత కీల‌క‌మైన‌ది, అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కమైన‌దిగా, వివాహంతోనే జీవితం ముడిప‌డిపోతుంది, వైవాహిక జీవితం లేక‌పోతే మ‌రేం లేదు, సంస్కృతి, సంప్ర‌దాయం, మూడుముళ్లు, ఏడ‌డుగులు.. అని ఘ‌నంగా చెప్పుకునే మ‌న‌దేశంలోనే ప‌రిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ప‌రిస్థితులు మారిపోవ‌డం అంటే.. అదేదో సంప్ర‌దాయానికి, సంస్కృతికి తెగ అన్యాయం జ‌రిగిపోవ‌డ‌మో, అదేదో జ‌ర‌గరాని ప‌ని జ‌ర‌గ‌డ‌మో కాదు! మ‌నుషుల జీవ‌న‌శైలి మారిపోతోంది. సామాజిక, ఆర్థిక ప‌రిస్థితులు మారిపోయాయి, ఇదే విధంగానే వివాహం ప‌ట్ల ధోర‌ణి కూడా మారిపోతోందంతే!

బాల్య వివాహాల ద‌గ్గ‌ర నుంచి.. న‌చ్చిన‌ప్పుడే వివాహం వ‌ర‌కూ ప‌రిస్థితులు మారాయి. అది కూడా కేవ‌లం రెండు ద‌శాబ్దాల‌లోనే. 90ల‌లో కూడా ఇండియాలో బోలెడ‌న్ని బాల్య‌వివాహాలు ఉండేవంటే ఆశ్చ‌ర్య‌పోవ‌చ్చు కొంత‌మంది. బాల్య‌వివాహాలంటే మ‌రీ తొమ్మిది ప‌దేళ్ల‌కు జ‌రిగేవే కావు. 18 యేళ్ల వ‌య‌సులోపు జ‌రిగే వివాహం ఏదైనా బాల్య వివాహ‌మే. 90ల‌లో గ్రామీణ ప్రాంతాల్లో.. ప‌దో త‌ర‌గ‌తి చ‌దువులోనే అమ్మాయిల పెళ్లిళ్లు చేసిన త‌ల్లిదండ్రులు ఎంతోమంది క‌నిపిస్తారు. ఇప్పుడు మ‌నం 2020ల‌లో ఉన్నాం. ఇప్పుడు అమ్మాయిలు లేచిపోయి పెళ్లిళ్లు చేసుకుంటే త‌ప్ప‌, క‌నీసం డిగ్రీ వ‌ర‌కూ చ‌దివించ‌డానికి త‌ల్లిదండ్రులు వెనుకాడటం లేదు. ఆ త‌ర్వాత కూడా వారి చ‌దువు, ఆలోచ‌న రీతిని బ‌ట్టే వివాహం జ‌రుగుతూ ఉంది.

కొంత‌మంది అమ్మాయిలు చ‌దువులు, ఉద్యోగాల వెంట ప‌డుతూ ఉన్నారు. వీరు 30ల‌లోకి ఎంట‌ర్ అయ్యాకా కూడా పెళ్లి గురించి ఆలోచించే తీరిక‌తో లేరు. ఈ ఆలోచ‌న‌ల వెనుక రీజ‌న్లు ఏవైనా ఉండ‌వ‌చ్చు. 28 యేళ్లు, ముప్పై యేళ్లు వ‌చ్చే వ‌ర‌కూ పెళ్లి గురించి గ‌ట్టిగా ఆలోచించ‌క‌పోవ‌డం మ‌రీ ఆశ్చ‌ర్య‌క‌రం ఏమీ కాదు. క‌నీసం ప‌దేళ్ల కింద‌టి వ‌ర‌కూ కూడా పాతికేళ్లు దాటాయంటే అమ్మాయిల‌కు ఇంకా పెళ్లి చేయ‌లేదా? అంటూ ఆరాలు వినిపించేవి. అయితే ఇప్పుడు ఆ వ్య‌వ‌హారం ముప్పైల వ‌ర‌కూ వ‌చ్చింది.

ముప్పై దాటుతున్నా అమ్మాయిల‌కు పెళ్లి.. అనేది మ‌రీ సీరియ‌స్ సబ్జెక్టు కాకుండా పోయింది. గ్రామీణ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన యువ‌తుల్లో కూడా చాలా మంది 30 దాటినా పెళ్లి గురించి ఆలోచ‌న‌ల్లేకుండా జీవించేస్తున్నారు స్వేచ్ఛ‌గా!

ఇంట్లో వాళ్లు, బ‌య‌టి వాళ్లు కూడా ఇంకా పెళ్లి లేదా.. అంటూ కామెంట్లు, ఒత్తిళ్లు చేసినా.. అవి కూడా క్ర‌మంగా త‌గ్గిపోతున్నాయి. జ‌రిగేట‌ప్పుడు, జ‌ర‌గాల్సిన‌ప్పుడు జ‌రుగుతుంద‌నే ధోర‌ణే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఎదిగిన కూతురు గుండెల మీద కుంప‌టి, 18 యేళ్లు దాటుతున్న అమ్మాయికి వీలైనంత త్వ‌ర‌గా పెళ్లి చేసేయాలి… అనే డైలాగులు కూడా లేవిప్పుడు. అమ్మాయిల పెళ్లి అనేది ఒక‌ప్పుడు త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌తిష్టాత్మ‌కం, భారం, భ‌యం.. సామాజికంగా ప‌రిస్థితులు మొత్తం మారిపోలేదు కానీ, గ‌త‌మంత ఒత్తిళ్లు మాత్రం లేవిప్పుడు.

ఇక అబ్బాయిల ప‌రిస్థితి మ‌రోర‌కంగా ఉంది. ఏ ఊర్లో చూసినా ప‌దుల సంఖ్య‌లో అబ్బాయిలు పెళ్లిగాక ఎదురుచూపుల్లో ఉన్నారు! చ‌దువు, ఉద్యోగం, ఆస్తులు.. ఈ మూడూ ఉంటేనే పెళ్లి గురించి ఆలోచించాలి త‌ప్ప‌, ఈ మూడింటిలో ఏ ఒక్క‌టి లేక‌పోయినా అబ్బాయిల‌కు పెళ్లి క‌ష్టంగా మారింది! కుటుంబానికి ప‌దుల ఎక‌రాల్లో ఆస్తులున్నాయి కానీ అబ్బాయికి ఉద్యోగం లేద‌న్నా పెళ్లి క‌ష్ట‌మే.  అలా కాదు, అబ్బాయికి ఉద్యోగం అయితే ఉంది కానీ, కుటుంబానికి వెన‌కేసిన ఆస్తులు లేవ‌న్నా.. పెళ్లి ప్ర‌య‌త్నాలు దుర్ల‌భం. 

ఇక‌ ఆస్తులూ పెద్ద‌గా లేవు, ఉద్యోగ‌మూ లేదు.. ఏదో చిన్న ప‌నో పెద్ద ప‌నో చేసుకుని బ‌తుకున్నాడంటే మాత్రం ఇక పెళ్లి అనేది అతి క‌ష్టంగా మారిపోయింది. గ‌త ద‌శాబ్ద‌కాలం నుంచినే ఈ ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలో ఏ ఊర్లో చూసినా ప‌దుల సంఖ్య‌ల్లో యువ‌కులు పెళ్లి కాక మిగిలిపోతున్నారు. వ్య‌వ‌సాయంలోనో, వ్యాపారంలోనో తాము సంపాదిస్తున్నా.. త‌మ‌కు పిల్ల‌ను ఇవ్వ‌డానికి ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేదని వాపోయే వారు బోలెడంత‌మంది క‌నిపిస్తారు ఏ ఊరికి వెళ్లినా. అటు అమ్మాయిల ధోర‌ణీ మారింది, అబ్బాయిల‌ను పరిస్థితీ మారిపోయింది. వీటి ఫ‌లితాలు రాబోయే ద‌శాబ్దాల‌పై ఉండ‌బోతున్నాయి.