ఆయన సీనియర్ నేత, మాజీ మంత్రి. తన రాజకీయ భవిష్యత్తు మీద బెంగతో ఉన్న పార్టీ మీద విమర్శలు చేస్తూ మీడియాకు ఎక్కారు. కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ జగన్ని పట్టుకుని అనాల్సినవి అన్నీ అనేశారు. తన కోపాన్ని ఆ విధంగా ఆయన తీర్చుకున్నారు. ఏదో పదవి ఆశించే ఎవరైనా పార్టీలో చేరుతారు మూడున్నరేళ్ళు గడచినా పెద్దాయనకు ఏ అవకాశమూ దక్కలేదు. దాంతో ఆయన వైసీపీ ప్రభుత్వానికి ఒంటరి సంఖ్యే అంటూ తనకు తోచిన జోస్యాన్ని కూడా వదిలారు.
వైసీపీని తిడుతూనే తెలుగుదేశాన్ని పొగిడారు. చంద్రబాబును మించిన పాలనాదక్షుడు లేరు అంటూ కితాబు ఇచ్చారు. ఎన్టీయార్ ఉమ్మడి ఏపీలో సంక్షేమ పధకాలు అంటూ ఆర్ధిక ఇబ్బందులు తెస్తే బాబు ఆయన తరువాత వచ్చి అన్నీ చక్కదిద్దారని గత చరిత్రను వల్లె వేశారు. బాబు ఆయన తరువాత వచ్చారు అని అన్నారు కానీ వెన్నుపోటుతో అని ఎక్కడా అనకుండా డీఎల్ జాగ్రత్త పడ్డారు.
ఇపుడు ఏపీకి కూడా బాబు మాత్రమే సరైన పాలన అందించగలరని డీఎల్ అభిప్రాయపడ్డారు. ఆయన అక్కడితో అని ఊరుకుంటే ఫరవాలేదు కానీ మధ్యలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తీసుకుని వచ్చారు. ఆయన్ని పొగుడుతూనే చెప్పాల్సింది కుండబద్ధలు కొట్టారు. పవన్ నిజాయతీపరుడు అన్నాఉ. అయితే ఆయనకు పాలనానుభవం లేదని డీఎల్ అనడం ద్వారా జనసైనికులకు మంటెక్కించారు.
తమ నాయకుడు నిజాయతీపరుడని డీఎల్ చెప్తే దాన్ని ఆహ్వానిస్తున్న జనసేన నేతలు అనుభవం లేదని అంటే మాత్రం బాగా గుచ్చుకుంటున్నారు. బొలిశెట్టి సత్యనారాయణ దీని మీద మాట్లాడుతూ పెద్దాయన అలా అనడం సరికాదని మండిపడ్డారు. పవన్ పాలనాదక్షత తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉందని బొలిశెట్టి చెబుతున్నారు. అంటే పవన్ సీఎం అవుతారని తన పవర్ ఏంటో చూపిస్తారు అని బొలిశెట్టి గట్టిగా బల్లగుద్దుతున్నారన్న మాట.
విషయం చూస్తే డీఎల్ జగన్ మీద పడి విమర్శలు చేశారు. అయితే ఆయన చాలాకాలంగా పార్టీకి దూరంగా ఉండడంతో ఆయన ఆరోపణలను వైసీపీ పెద్దగా పట్టించుకునట్లుగా కనిపించలేదు. తెలుగుదేశాన్ని పొగిడారు అయినా ఆ పార్టీ నుంచి డీఎల్ కి మద్దతు ఎంత దక్కిందో తెలియదు, జనసేనానికి పొగుడుతూనే తాను అనుకున్న విషయం చెప్పేసరికి మాత్రం జనసేన నుంచి పెద్దాయనకు మాటల దాడి స్టార్ట్ అయిపోయింది.