‘’…మతం మరియు కులం అనే రెండు ఏ మానవుడిని కూడా అతనియొక్క ఉన్నత శిఖరాలను సాధించకుండా మరియు కనీసం మనిషిగా కూడా బ్రతకనీయకుండా అడ్డుకుంటున్న రెండు సంకెళ్లులా తయారయ్యాయి … కాబట్టి ప్రతీ మనిషి తన లక్ష్యాలను చేరుకోవాలంటే మొదట మతం మరియు కులం అనే వాటికి దూరంగా బ్రతకడం నేర్చుకోవాలి..’’
జనసేన లెఫ్టినెంట్ అనుకోవచ్చు ఏమో కొణిదెల నాగబాబును. సోదరుడు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తరువాత ఆయనే కదా లీడర్. అలాంటి లీడర్ ఉన్నట్లుండి ట్విట్టర్ లో ప్రవచనాలు మొదులు పెట్టారు. కానీ ఇవి కాస్తా ఎదుటి మనిషి చెప్పేటందుకే నీతులు వున్నాయి అన్నట్లుగా వున్నాయి తప్ప మరో విధంగా అయితే కాదు.
నాగబాబు పార్టీ అయిన జనసేన పొత్తు పెట్టుకున్నది భారతీయ జనతా పార్టీతో. ఆ పార్టీ పుట్టింది. పెరిగింది. నడుస్తున్నది హిందూత్వ పునాదుల మీద అన్న సంగతి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకుని మతం అనేది మానవుడి అభ్యున్నతికి సంకెలగా మారింది..దానికి దూరంగా బతకండి అంటారేంటీ? అంటే కొంపదీసి భాజపాకు దూరంగా జరిగే ఆలోచన వుందని ఇలా చెబుతున్నారా?
సరే, ఆ సంగతి అలా వుంచితే 2019లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న పవన్ కళ్యాణ్ ఇటీవల పదే పదే కులం గురించి, కులం ఓట్ల గురించి మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. కాపునాడు పేరుతో కాపు ఓట్లను సమీకృతం చేసి జనసేన దిశగా నడిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో నాగబాబు కులం సంకెల తెంచుకోండి అంటారేంటీ?
అసలు ఆ మాటకు వస్తే మెగా హీరోల సినిమాల మార్కెటింగ్ వెనుక కులం అనే బలం బలంగా వుందని అంటారు అందరూ. మరి ఇప్పుడు ఇలా కులం వద్దు అని సుద్దులు చెప్పడం ఏమిటొ? అయినా పెద్ద వాళ్లు మాట్లాడే మాటలు ఇలాగే అర్థం కాకుండా వుంటాయేమో?