క్రికెట్ లో కొన్ని చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇలాంటి విచిత్రాలు కొందరి ఆటగాళ్ల కెరీర్ విషయంలో కూడా చోటు చేసుకోవడం గమనార్హం. ఒక టెస్టు మ్యాచ్ లోనే కరుణ్ నాయర్ అనే క్రికెటర్ ట్రిపుల్ సెంచరీని సాధించి అత్యంత అరుదైన ఫీట్ ను నమోదు చేస్తే.. ఆ మ్యాచ్ తర్వాత ఇప్పటి వరకూ అతడికి మరో అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం లభించలేదు! 300 పరుగులు చేసిన టెస్టు తర్వాతి మ్యాచ్ లోనే అతడికి అవకాశం లభించలేదు! బెంచ్ కు పరిమితం అయ్యాడు. ఆ తర్వాత అయితే టెస్టు ప్రాబబుల్స్ లో కూడా అతడి పేరు లేకుండా పోయింది పాపం!
300 పరుగులు చేసిన తర్వాత మళ్లీ అవకాశం లభించని క్రికెటర్ గా నాయర్ పేరు నిలిచిపోతుంది. బహుశా మరి కొన్నేళ్లకు అతడు రిటైర్మెంట్ కూడా ప్రకటించుకోవాల్సి రావొచ్చు! నాయర్ కు ఎందుకు అవకాశం లభించలేదు? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారు ఎవరూ లేరు. ఎలాంటి విశ్లేషకుడికి కూడా అందుకు సమాధానమూ లభించదు.
ఆ సంగతలా ఉంటే.. ఈ తరహాలోనే 12 యేళ్ల తర్వాత రెండో టెస్టు మ్యాచ్ ను ఆడే అవకాశం లభించింది జయదేవ్ ఉనాద్కత్ కు. ఎప్పుడో 2010లో ఈ ఫాస్ట్ బౌలర్ టీమిండియా తరఫున తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అది సౌతాఫ్రికాలో, సౌతాఫ్రికాతో. ఆ మ్యాచ్ లో ఈ బౌలర్ వికెట్ల విషయంలో ఖాతా తెరవలేకపోయాడు. కొత్త బౌలర్లు తమ తొలి మ్యాచ్ లలో వికెట్లు తీయలేకపోవడం అంత విచిత్రం కాదు! ఉనాద్కత్ విషయంలోనూ అదే జరిగింది. అయితే సెంచూరియన్ లోనే వికెట్ తీయలేకపోయిన ఇతడు ఏం బౌలర్ అన్నట్టుగా పక్కన పెట్టేశారు! ఏవో ఒకటీ రెండు వన్డే, టీ20లు ఆడే అవకాశం వచ్చినా ఉనాద్కత్ కు మళ్లీ టెస్టు ఆడే అవకాశం పుష్కరకాలం తర్వాత వచ్చింది. బంగ్లాదేశ్ పై బంగ్లాలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో ఇతడికి ఛాన్సు లభించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఉనాద్కత్ ఖాతా తెరిచాడు. తొలి వికెట్ ను దక్కించుకున్నాడు. మొత్తంగా తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లను పడగొట్టాడు. తద్వారా టెస్ట్ ఆరంగేట్రం చేసిన పన్నెండేళ్లకు తొలి వికెట్ ను దక్కించుకున్నట్టైంది.
ఇదే బౌలర్ విషయంలో మరింత విశేషాలున్నాయి. ఇతడి ఐపీఎల్ రేటు ఒక రికార్డు స్థాయి! ఐపీఎల్ లో అత్యధిక ధరకు అమ్ముడైన ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఉనాద్కత్. ఒకసారి కాదు..2014లో 2.80 కోట్ల ధర పలికాడు ఇతడు. అప్పటికి అది భారీ ధరే. ఆ తర్వాతి ఏడాది కోటీ పది లక్షలు, ఆ తర్వాతి ఏడాది కోటీ అరవై లక్షలు ఇతడి ధర పలికింది. కానీ 2017లో అతి తక్కువ స్థాయిలో ముప్పై లక్షలకే ఆడాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాతి ఏడాది ఇతడి దశ తిరిగింది. 2018లో ఏకంగా 11.50 కోట్ల రూపాయలకు ఇతడిని దక్కించుకుంది రాజస్తాన్ రాయల్స్ జట్టు.
కానీ ఆ తర్వాతి ఏడాది ఇతడు మళ్లీ వేలానికి రావాల్సి వచ్చింది. ఈ సారి 8.40 కోట్ల భారీ స్థాయి అమౌంట్ కే ఇతడిని రాజస్తాన్ రాయల్స్ మళ్లీ దక్కించుకుంది. 11.50 కోట్ల ధరను అలా తగ్గించుకుంది. ఇక 2020, 21లలో మూడు కోట్ల రూపాయల ధరతో మళ్లీ ఆ జట్టే ఇతడిని కొనసాగించుకుంటోంది.
ఇలా ఉనాద్కత్ కెరీర్ అంచనాలకు భిన్నంగా సాగుతూ ఉంది. 19 యేళ్ల వయసులోనే తొలి టెస్టు అవకాశం దక్కింది. రెండో టెస్టు ఆడే సరికి 31 యేళ్లు వచ్చాయి. ఇక ఐపీఎల్ ప్రదర్శనలో కూడా అత్యద్భుతాలు లేకపోయినా, జాతీయ జట్టులో పర్మినెంట్ బౌలర్ల కన్నా ఎక్కువ రేటు దక్కింది! ఇలా ఆట కొంచెమే అయినా ఉనాద్కత్ కెరీర్ విషయంలో బోలెడన్ని విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. పుష్కర కాలం తర్వాత జాతీయ జట్టు అవకాశం పొందిన ఉనాద్కత్ కెరీర్ ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో!