సాకర్ ఫీవర్ ముందు క్రికెట్ అనే మతం చిన్నబోతోంది! క్రికెట్ ను ఒక మతంగా అభివర్ణిస్తూ ఉంటారు విశ్లేషకులు. జనులకు ఒక మతం అంటే ఎంత గౌరవమర్యాదలుంటాయో, మతాన్ని ఎంతగా అభిమానిస్తారో, క్రికెట్ ను కూడా అంతలా అభిమానిస్తారని.. ఉపఖండంలో క్రికెట్ క్రేజ్ ను వర్ణిస్తుంటారు మాజీలు, క్రికెట్ విశ్లేషకులు. ఇక ఫుట్ బాల్ ఫీవర్ అనేది ప్రాసతో కూడా వర్ణన.
క్రికెట్ ను ప్రపంచంలో కొన్నే దేశాల్లో అతిగా అభిమానిస్తారు. బాగా చూస్తారు. ఫుట్ బాల్ ప్రపంచంలో అత్యధికంగా వీక్షించే క్రీడ. అయినప్పటికీ ఫుట్ బాల్ గురించి పెద్దగా తెలీని, అసలేం తెలీని దేశాలు కూడా బోలెడన్ని ఉన్నాయి. అంతర్జాతీయంగా అత్యంత వీక్షకాదరణ ఉన్నా.. ఫుట్ బాల్ ప్రపంచకప్ లో ఆడేది 32 దేశాలే. వాటిల్లో కూడా ఉత్తుత్తి జట్లు చాలానే ఉంటాయి. క్రికెట్ వరల్డ్ కప్ లో అసోసియేట్ దేశాలు పాల్గొన్నట్టుగా, అర్హత సాధించాయంటూ స్కాట్ లాండ్, హాలెండ్, నమీబియా వంటి జట్లను ఐసీసీ వరల్డ్ కప్ లో ఆడించినట్టుగా ఫిఫా నిర్వహించే ప్రపంచకప్ లో కూడా ఈ తరహా స్థాయి దేశాలుంటాయి.
ఇప్పటి వరకూ ఫిఫా ప్రపంచకప్ ను సాధించింది కేవలం ఎనిమిది దేశాలు మాత్రమే! ఫుట్ బాల్ ను శ్వాసించే బోలెడన్ని దేశాలు ఇంకా ప్రపంచకప్ కలను కనే సాహసం కూడా చేయడం లేదు! ఇలా అంతర్జాతీయ ఫుట్ బాల్ ప్రమాణాలను అందుకునే దేశాలు ఏడెనిమిదికి మించి లేనట్టుగా కనిపిస్తున్నాయి. క్రికెట్ లో కూడా అంతర్జాతీయ స్థాయి ఆట అనదగ్గ ప్రదర్శన ఏడెనిమిది దేశాలకు ఉంది.
కానీ మార్కెట్ పరంగా చూస్తే ఫుట్ బాల్ ముందు క్రికెట్ బాల్ చిన్నబోతుంది. సాకర్ మార్కెట్ స్థాయి ఫుట్ బాల్ సైజ్ లో ఉందనుకుంటే, దాంతో పోల్చినప్పుడు క్రికెట్ స్థాయి క్రికెట్ బాల్ అంత ఉంది! ఈ సారి ప్రపంచకప్ లో పాల్గొన్న ప్రతి సాకర్ జట్టూ కనీస ప్రైజ్ మనీ 74 కోట్ల వరకూ పొందింది. ఇది జస్ట్ పార్టిసిపేట్ చేసినందుకు ఇచ్చిన అమౌంట్. మరి క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు ఇస్తున్న ప్రైజ్ మనీ ఇందులో ఎన్నో వంతు? పది కోట్లు? మహా అంటే 15 కోట్లు.. ఇదొక్కటీ చాలు సాకర్ ముందు క్రికెట్ మార్కెట్ ఎంత పరిమితమో చెప్పడానికి!
ఇక ఆటను అభిమానించడంలో కూడా సాకర్ ఫ్యాన్స్ ముందు క్రికెట్ ఫ్యాన్స్ చిన్నబోతున్నారు. దశాబ్దాల తర్వాత ప్రపంచకప్ సాధనతో అర్జెంటీనా తన ఫెస్టివ్ మూడ్ నుంచి బయటకు రావడం లేదు! తమ సాకర్ ప్లేయర్లను దేవుళ్లుగా ఆరాధిస్తోంది అర్జెంటీనా. కేవలం అర్జెంటీనా పరిధిలో మాత్రమే కాదు.. దాని ఆవల కూడా ఫుట్ బాల్ ఫీవర్ పతాక స్థాయిలో కొనసాగుతూ ఉంది. నాలుగు కోట్ల స్థాయి జనాభా ఉన్న అర్జెంటీనాలో ప్రపంచకప్ ను సాధించుకు వచ్చిన తమ జట్టుకు ఊరేగింపుకు ఏకంగా 30 లక్షల మంది హాజరయ్యారట! అంటే దేశ జనాభాలో ప్రతి నలుగురైదుగురులో ఒకరు ఆ ప్రదర్శనలో పాల్గొన్నారు.
2011లో ఇండియా క్రికెట్ ప్రపంచకప్ ను సాధించినప్పుడు జరిగిన ఊరేగింపులో మహా అంటే ఎంతమంది పాల్గొని ఉంటారు? మహా అంటే.. పది లక్షల ముంది? అది కూడా ఎక్కువే! ఇలా చూస్తే సాకర్ ఫీవర్ తో ఊగిపోయే దేశాలు ఆ ఆటను అభిమానిస్తున్నంత స్థాయిలో క్రికెట్ ను ఆరాధించే దేశాలు, క్రికెట్ మాత్రమే ఆట అనుకునే దేశాలు పోటీ పడలేకపోతున్నాయి!