తెలంగాణ కాంగ్రెస్ ను ఉద్ధరించడానికి మరో ఉత్తముడు బరిలోకి దిగాడు. ఈయన కొత్త కాదు. పాత కాపే! దాదాపు దశాబ్దం క్రితం తనవైన సలహాలతో తెలుగు ప్రాంతంలో కాంగ్రెస్ ను భ్రష్టు పట్టించడంలో ఈ రాజావారికి కూడా పెద్ద పాత్రే ఉంది! తన సలహాలు సూచనలతో దేశంలో కాంగ్రెస్ ను చాలా చోట్ల పాతాళానికి తొక్కేసి, అనంతరం తను పెళ్లి చేసుకుని.. ప్రైవేట్ లైఫ్ ను గడిపి, ఇప్పుడు మళ్లీ వచ్చారు మధ్యప్రదేశ్ రాజకుటుంబీకుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్.
ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్యన సయోధ్యను కుదిర్చేందుకు దిగ్విజయ్ సింగ్ చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తే.. జంధ్యాల రాసిన ఒక సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది. శ్రీవారికి ప్రేమలేఖలో సుత్తివీరభద్రరావు తన దగ్గర పద్దులు రాసే వ్యక్తి ఏదో సలహా ఇవ్వబోతే.. అతడిపై విరుచుకుపడుతూ… 'నువ్వు నోర్ముయ్.. నీ ఉచిత సలహాలు వినడంతోనే మా కొంప బూజు పట్టిన ఆవకాయ జాడీలా ఇలా తయారైంది..' అంటూ తన వైన విరుపులతో డైలాగ్ చెబుతాడు. అచ్చంగా దిగ్విజయ్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ను ఉద్ధరించడానికి చేస్తున్న ప్రయత్నం ఆ డైలాగ్ నే గుర్తు చేస్తుంది.
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి బూజుపట్టిన ఆవకాయ జాడీలాగానే ఉంది. దీనికి కారణాలు ఏమిటి? అని చెప్పడానికి ప్రత్యేక అధ్యయనాలు అక్కర్లేదు. పుష్కర కాలం కిందట దిగ్విజయ్ లాంటి వాళ్ల అతి మేధోతనంతోనే.. కాంగ్రెస్ పరిస్థితి ఇలా తయారైంది.
'తోటకూర నాడే..' అన్నట్టుగా.. అప్పుడే తామేం చేస్తున్నామో గ్రహించి ఉంటే ఈ కాంగ్రెస్ జాతీయోత్తములకు ఇప్పుడు ఇలా చేతులు కాలిపోయిన తర్వాత ఆకులందుకునే అగత్యం ఉండేది కాదు. రాష్ట్ర విభజనకు పాల్పడితే తమకు జరిగే నష్టం ఏమిటో అంచనా వేయడానికి ఆవగింజత మెదడు లేకపోయింది. వీరు ఇప్పుడు ఈ బూజుపట్టిన అవకాయ జాడీని సరి చేస్తారనుకుని కాంగ్రెస్ అభిమానులు ఆశించడం కూడా దురాశే కాదా!