చైనాలో కోవిడ్ మళ్లీ బుసలు కొడుతోందని వార్తలు వస్తున్నాయి. అనధికారికంగా వెలుగులోకి వచ్చిన కొన్ని వీడియోలు కోవిడ్ విషయంలో పాత భయాలను కలిగిస్తున్నాయి. హాస్పిటల్స్ లో వరస పెట్టి కోవిడ్ రోగుల శవాలున్నాయని.. చైనాకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. తమకు సంబంధించిన ఏ సమాచారాన్ని అయినా చైనా ప్రభుత్వం ఇనుపతెరల నుంచి బయటకు వెల్లడి కానివ్వదు. కోవిడ్ పరిస్థితి గురించి తొలి దశలో కూడా ఇదే పని చేసింది.
రెండు మూడు ప్రావీన్స్ లలో కరోనా తొలి దశలోనే కరాళానృత్యం చేసినా చైనా అసలు సంగతులను బయటకు రానివ్వలేదు. తన తీరుతో కరోనాను ప్రపంచ వ్యాప్తం చేయడంలో కూడా చైనా పాత్ర చిన్నదేమీ కాదు. కరోనా గురించి తెలిసి కూడా అంతర్జాతీయంగా విమానాల రాకపోకలను నియంత్రించలేదు. చైనా నుంచి యూరప్ చేరిన కరోనా ఆ తర్వాత ప్రపంచంలో అనేక దేశాలను ముప్పుతిప్పలు పెట్టింది. లక్షల మంది ప్రాణాలనూ తీసింది. అయినా చైనా తీరు మారలేదు. మారుతుందని అనుకోవడం కూడా మూర్ఖత్వమే.
ఈ మూర్ఖత్వం ఆఖరికి చైనీయుల పాలిట కూడా అత్యంత ప్రమాదకరంగా మారింది. ప్రపంచం గత ఏడాది కాలంగా కరోనా పెద్దగా పట్టించుకోలేదు. అయితే చైనా మాత్రం కరోనాతో అపసోపాలు పడుతూనే ఉంది గత ఏడాదిగా కూడా! ఇప్పుడు మళ్లీ పతాక స్థాయికి చేరింది పరిస్థితి. జీరో కోవిడ్ పాలసీ అంటూ చైనా రకరకాల లాక్ డౌన్లను, నియంత్రణలను పెట్టుకుంటూ వచ్చింది. అయినా కరోనా నియంత్రణలోకి రాలేదు. కొత్త వేరియెంటో, మిగతా ప్రపంచంపై పెద్దగా ప్రభావం చూపని పాత వేరియెంటో కానీ.. చైనా తను నిర్మించుకున్న ఇనుపతెరల్లో మళ్లీ మగ్గిపోతోంది.
ఈ నేపథ్యంలో చైనా పరిస్థితి గురించి రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చైనాలో ఇప్పుడు కరోనా ఇంత తీవ్ర స్థాయికి చేరడానికి కారణాల్లో ఒకటి అక్కడి టీకాలు కూడా అంటున్నాయి విశ్లేషణలు. కరోనా నియంత్రణకంటూ ప్రపంచ వ్యాప్తంగా తయారైన వివిధ వ్యాక్సిన్లలో చైనాలో తయారైనవాటి సామార్థ్యం ప్రశ్నార్థకం. చైనా ఏమో తను తయారు చేసిన టీకాలు అత్యంత సామర్థ్యంతో కూడుకున్నవని చెప్పుకుంది. ఇదే లెక్కలతో బ్రెజిల్ వంటి దేశానికి టీకాలు ఇచ్చింది.
అక్కడ వీటి సామర్థ్యం గురించి పరీక్షలు జరగ్గా.. అన్ని వ్యాక్సిన్లలో కెళ్లా చాలా తక్కువగా తేలింది వీటి సామర్థ్యం. ఇండియాలో తయారైన కో వ్యాగ్జిన్ 78 శాతం రేటింగ్ పొందితే, చైనా వ్యాక్సిన్లు 73, 66, 50 శాతాల స్థాయి సామర్థ్యంతో కూడుకున్నవని కొన్ని పరిశోధనలు చెప్పాయి. మోడెర్నా టీకా ప్రథమ స్థాయిలో నిలిచింది ఈ జాబితాలో. నాణ్యత లేని వస్తువుల తయారీకి పేరు పొందిన చైనా, టీకాల విషయంలో తన దైన రీతినే సాగించినట్టుగా ఉంది.