రాజకీయాల్లో అనుభవాలు, వయసు పెరిగేకొద్ది ఎవరికైనా బుద్ధి వికసిస్తుంది. మనిషిలో పరిణితి కనిపిస్తుంది. అదేంటోగానీ, సుదీర్ఘ రాజకీయ, పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు మాటల్లో, నడవడికలో మాత్రం రోజురోజుకూ దిగజారుడుతనం కనిపిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజకీయాల్లో, పరిపాలనలో, నడవడికలో పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ, అందరికీ మార్గదర్శిగా చంద్రబాబు వుండి వుంటే ఎంతో బాగుండేది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు మోస్ట్ సీనియర్ లీడర్.
పది మందికి మంచీ చెడు చెప్పాల్సిన వయసులో ఉన్న చంద్రబాబు… అదేం ఖర్మో గానీ, పది మందితో హితవు చెప్పించుకుంటున్నారు. ఖమ్మంలో టీడీపీ విజయ శంఖారావం బహిరంగ సభ నిర్వహించారు. ఇది విజయవంతమైంది. కానీ సభలో చంద్రబాబు మాట్లాడిన తీరు ప్రత్యర్థులే కాదు, సొంతవాళ్లు కూడా తప్పు పడుతున్నారు. బహుశా రెండు రాష్ట్రాలు ఏకం కావడంపై చంద్రబాబు తన మాటలకు తనే సిగ్గుపడినట్టున్నారు. అందుకే నేరుగా ఎవరి పేర్లు ప్రస్తావించకుండా రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని భావించినట్టున్నారు.
ఖమ్మం సభలో ఆయన ఏమన్నారంటే… “రెండుగా విడిపోయిన రాష్ట్రాలను కొందరు మళ్లీ కలవాలంటూ సిగ్గు, శరం లేకుండా చెబుతున్నారు. అటు ఏపీ, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని , దేశంలో మొదటి రెండు స్థానాల్లో ఉండాలన్నదే మా విధానం” అని చంద్రబాబు అన్నారు.
ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలను టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా వివాదాస్పదం చేయతలపెట్టింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ విభజన సక్రమంగా జరగలేదంటూ వేసిన పిటిషన్ విచారణకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఏమంటారని మీడియా ప్రతినిధులు సజ్జలను ప్రశ్నించగా… రాష్ట్ర విభజన జరిగిపోయిందని, మళ్లీ కలిసే అవకాశం లేదన్నారు. కానీ రెండు రాష్ట్రాలు కలిసి వుండాలనేదే తమ పార్టీ విధానం అని, గతంలో కూడా ఇదే చెప్పామని ఆయన గుర్తు చేశారు.
ఈ వ్యాఖ్యలను పట్టుకుని టీడీపీ చిలువలు పలువలు చేయాలని ప్రయత్నించడం గమనార్హం. సజ్జల మాటలపై చంద్రబాబు పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రెండుగా విడిపోయిన రాష్ట్రాలు కలవాలని కోరుకోవడం సిగ్గు, శరం లేని అంశాలని ఆయన ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణలో రాజకీయ స్వార్థం కోసం సజ్జల మాటలకు వక్రభాష్యం చెబుతున్న చంద్రబాబుకు సిగ్గు, శరం లేవా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
అసలు తెలంగాణ రాజకీయాలతో వైసీపీకి సంబంధమే లేదని ఆ పార్టీ నేతలు ఎప్పుడో చెప్పారు. కనీసం తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టుకుని ఒంటరి పోరు చేస్తున్న చెల్లి సోదరి రాజకీయాలతో కూడా సంబధం లేదని చెప్పిన జగన్‌కు సిగ్గు, శరం లేవా? లేక అవసరానికి ప్రాంతాలను, పార్టీలను, సెంటిమెంట్‌ను వాడుకునే చంద్రబాబుకా? అని నెటిజన్లు నిలదీస్తున్నారు.