ఒమిక్రాన్ ఉప రకం బీఎఫ్ -7 కేసులు భారత్‌లోనూ వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ కొత్త వేరియంట్ దెబ్బతో చైనా, అమెరికా, జపాన్ తదితర దేశాల్లో ఆందోళన నెలకుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ కేసులో మన దేశంలో కూడా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మనదేశంలో మరోసారి లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారం ఊపందుకుంది.
కొత్త వేరియంట్ ప్రమాదకరమని, దాని బారిన పడితే ప్రాణాలు పోతాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భారత వైద్య సంఘానికి (ఐఎంఏ) చెందిన డాక్టర్ అనిల్ గోయల్ దేశ ప్రజానీకంలో మనో ధైర్యం నింపే కీలక ప్రకటన చేయడం విశేషం. దేశంలో లాక్‌డౌన్ విధించే ప్రమాదకర పరిస్థితి తలెత్తదని ఆయన స్పష్టం చేశారు.
దీనికి సరైన కారణాన్ని కూడా ఆయన చెప్పారు. ఇప్పటికే దేశ జనాభాలో అర్హులైన వారికి 95 శాతం వ్యాక్సి నేషన్ పూర్తి చేయడం వల్ల ప్రమాదమేమీ లేదని డాక్టర్ అనిల్ గోయల్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా చైనా దేశస్తులతో పోలిస్తే భారతీయుల రోగనిరోధక శక్తి ఎక్కువన్నారు. అలాగని జనం నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని హెచ్చరించారు.
కరోనా మహమ్మారి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమైన పని అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జనం రద్దీగా ఉన్న చోటికి వెళ్లకపోవడం మంచిదని అంటున్నారు. ఒకవేళ వెళ్లినా మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని వైద్యులు చెబుతున్నారు. గతంలో మాదిరిగా భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లను తప్పనిసరిగా వాడడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
కరోనాతో సహజీవనం చేస్తూనే, అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత గురించి వైద్యులు, పాలకులు నొక్కి చెబుతుండడాన్ని ప్రతి ఒక్కరూ పరిగణలోకి తీసుకోవాలి. మరీ ముఖ్యంగా లాక్‌డౌన్ విధించే పరిస్థితి మనదేశంలో ఉత్పన్నం కాదనే వైద్య నిపుణుల మాటలు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాయి.