కరోనా తీవ్రంగా వ్యాపించిన దేశాల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బ్రెజిల్. యూఎస్ లో ఇప్పటికే మొత్తం కరోనా కేసుల సంఖ్య 52 లక్షలను దాటిపోయింది. బ్రెజిల్ లో కేసుల సంఖ్య 30 లక్షలనే. ఇలా మొత్తం కరోనా కేసుల విషయంలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి యూఎస్, బ్రెజిల్. మూడో స్థానంలో ఇండియా నిలుస్తోంది. ఇండియాలో 22 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.
అయితే గమనించాల్సిన అంశం ఏమిటంటే.. యూఎస్, బ్రెజిల్ లలో రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతూ ఉంది. అమెరికాలో ఒక దశలో రోజువారీ కేసుల డెబ్బై వేలను కూడా దాటింది. అయితే క్రమంగా అందులో తగ్గుదల చోటు చేసుకుంటూ ఉంది. 50 వేల స్థాయికి తగ్గి, ఇప్పుడు 40 వేల స్థాయికి చేరాయి అమెరికాలో డైలీ కేసుల సంఖ్య. భారీ సంఖ్యలో టెస్టులు చేస్తున్న దేశంగా నిలుస్తోంది యూఎస్. ఇలాంటి నేపథ్యంలో అలాంటి చోట రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం గమనార్హం.
ఇక బ్రెజిల్ లో ఇప్పుడు రోజు వారీ కేసుల సంఖ్య 20 వేల స్థాయికి చేరాయి. ఒక దశలో బ్రెజిల్ లో కూడా ప్రతి రోజూ 40 వేలు, 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అలాంటి చోట కూడా ఇప్పుడు రోజువారీ కేసుల సంఖ్య 20 వేల స్థాయికి చేరడం ఊరటగా మారింది.
ఇలా మొత్తం కేసుల విషయంలో అత్యధిక స్థాయిలో ఉన్న రెండు దేశాల్లో కరోనా ప్రభావం తగ్గుతూ ఉండటం ఊరటను ఇచ్చే అంశమే. అటు యూఎస్, బ్రెజిల్ లలో రోజువారీ కేసుల సంఖ్యలో తగ్గుదల చోటు చేసుకోవడంతో.. ఇప్పుడు ప్రపంచంలోనే రోజువారీగా ఎక్కువ కేసులు నమోదవుతున్న దేశంగా ఇండియా నిలుస్తోంది. ఇండియాలో ఆగస్టు పదిన 50 వేల స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి.
అయితే ఇండియాలో రికవరీ రేటు కొత్త కేసులకు దాదాపు సరిసమానంగా ఉంటోంది. అలాగే యూఎస్, బ్రెజిల్ లతో పోలిస్తే.. ఇండియాలో కరోనా ప్రభావ మరణాల రేటు కూడా తక్కువ. అతి త్వరలోనే ఇండియా కూడా యూఎస్, బ్రెజిల్ దేశాల వలే డైలీ కేసుల నంబర్ ను- కరోనా ఇన్ఫెక్షన్ ను నివారించగలిగితే.. కరోనా పై విజయం సాధించినట్టే.