తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉండేది. ఆ తర్వాత కాంగ్రెస్ బలహీన పడి బీజేపీ బలపడుతూ వస్తోంది. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందింది. బీఆర్ఎస్‌కు తామే ప్రధాన ప్రత్యామ్నాయం అని బీజేపీ నేతలు అంటున్నారు.
రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడంతో ఆ పార్టీలో నూతనోత్సాహం నెలకుంది. మునుగోడులో బీజేపీ గట్టి పోటీ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌తో పాటు మరికొన్ని పార్టీలు కూడా తెరపైకి వచ్చాయి. చంద్రబాబునాయుడు నిన్న ఖమ్మంలో పర్యటించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ ఘాటు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తెలంగాణలో చంద్రబాబు, పవన్, షర్మిలలు బీజేపీ దూతలని గంగుల కమలాకర్ ఆరోపించారు. అసలు కేఏ పాల్, పవన్, షర్మిలలకు తెలంగాణలో ఏం పని అని ఆయన నిలదీశారు. తాజాగా అసలు సిసలు మనిషి చంద్రబాబు కూడా తెలంగాణలో ప్రవేశించారని అన్నారు.
రెండు రాష్ట్రాలు జూన్ 2న ఏర్పడినా.. చంద్రబాబు ప్రమాణం చేయలేదని గుర్తు చేశారు. ఏపీ మూలాలు ఉన్న నేతలకు తెలంగాణలో ఏం పని అని నిలదీశారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రజలు కూడా అక్కడి పార్టీలను నమ్మడం లేదన్నారు. ఏపీలో కచ్చితంగా పోటీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.