ఖమ్మంలో చంద్రబాబు విజయవంతం కావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకుంది. దీంతో ఏపీతో పాటు తెలంగాణలో కూడా రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందన్న ఓవరాక్షన్ ఆ పార్టీ నాయకులు చేస్తున్నారు. తెలంగాణ నుంచి తమ నాయకుడు ఎలాంటి దుస్థితిలో ఆంధ్రాకు వెళ్లాడో టీడీపీ నేతలు మరిచినట్టున్నారు. ఖమ్మంలో టీడీపీ సభ విజయవంతంతో అప్పుడే అధికారం కూడా వచ్చినట్టు కలలు కంటున్నారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తనదైన స్టైల్‌లో చంద్రబాబుపై పంచ్‌లు విసిరారు. చుక్కలు ఎన్ని ఉన్న చందమామ ఒక్కడే అన్నట్టు, ఎన్ని పార్టీలు వచ్చినా, ఏమొచ్చినా తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆరే మాత్రమే ఉంటారన్నారు. తెలంగాణలోకి చంద్రబాబు మళ్లీ రావాలని ఉవ్విళ్లూరుతున్నారని విమర్శించారు. టీడీపీ ఇప్పటికే భూస్థాపితమైందని ఆమె అన్నారు. చంద్రబాబును తెలంగాణ ప్రజలు తిరస్కరించారన్నారు. చంద్రబాబు రాజకీయాలు ఇక్కడ నడవవని కవిత తేల్చి చెప్పారు.
తెలంగాణలో టీడీపీ భవిష్యత్‌పై ఆశలు వదులుకోవడం మంచిదని ఆమె హితవు చెప్పారు. టీడీపీ ప్రజల శ్రేయస్సు కోరుకునే పార్టీ కాదన్నారు. తెలంగాణ ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని కవిత తెలిపారు. 2018లో తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.
తెలంగాణలో చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో కేసీఆర్ ఆయుధంగా మలుచుకున్నారు. మనకు మళ్లీ ఆంధ్రోళ్ల పాలన అవసరం అంటూ పెద్ద ఎత్తున సెంటిమెంట్‌ను రగిల్చి… టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాల కూటమిని చావు దెబ్బతీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు తెలంగాణలో అడుగు పెట్టడంతో బీఆర్ఎస్ నేతలు రాజకీయ దాడికి దిగడం గమనార్హం.