కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తాను కార్పోరేట్ల పక్షమని డైరెక్ట్ గా చెబుతోందని ఏపీ సీఐటీయూ అంటోంది. దేశానికి స్వాతంత్రం వచ్చాక కార్మికులు ఇంతలా వత్తిడులు, నిర్బంధాలు ఎదుర్కొన్న సందర్భం బీజేపీ పాలనలోనే అని మండిపడుతోంది.
దేశానికి స్వాతంత్రం వచ్చాక కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక హక్కులకు ఇపుడు భంగం వాటిల్లుతోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నరసింగరావు అంటున్నారు. బ్రిటిష్ వారి హయాంలో హక్కులు అన్నవి కార్మికులు ఎరగరని, అలాగే స్వాతంత్ర దేశంలో కార్మికులకు వచ్చిన హక్కులు అన్నీ కూడా ఎవరి దయా దాక్షిణ్యంతో కానే కాదని ఆయన స్పష్టం చేశారు.
దేశంలో బీజేపీ పాలనలో కార్మిక హక్కుల కోసం జరిగిన అనేక పోరాటాలు ఒక భాగం మాత్రమే అసలైన కాలం ఇంకా ఉందని ఆయన అంటున్నారు. బీజేపీ పెట్టుబడుదారుల వైపే తాను అని కచ్చితంగా చెబుతున్న వేళ కార్మికుల ప్రయోజనాలకు కాపాడుకోనేందుకు అంతా ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని ఆయన అంటున్నారు.
విశాఖలో జరుగుతున్న సీఐటీయూ జిల్లా మహా సభలలో బీజేపీ కార్పోరేటీకరణ మీద చర్చిస్తున్నారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రైవేట్ పరం చేస్తూ పెత్తందారుల కొమ్ము కాసే వైఖరిని కూడా సీఐటీయూ ఖండిస్తోంది. ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు ఉంటేనే కార్మికులకు ఉద్యోగాలతో పాటు హక్కులు కూడా ఉంటాయని అంటోంది. బీజేపీతో ఎందాకైనా పోరు అంటూ సీఐటీయూ మహా సభలలో తీర్మానం చేస్తోంది.