బాబు నిర్ణయాన్ని జగన్ అమలు చేస్తారా? 

సాధారణంగా గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేయవు. ఎక్కడో కొన్ని రాష్ట్రాల్లో ఇందుకు మినహాయింపులు ఉంటాయి. ఇందుకు ఉదాహరణగా తమిళనాడు ప్రభుత్వాన్ని చెప్పుకోవచ్చు. కానీ ఏపీలో తమిళనాడు తరహా ప్రభుత్వ…

సాధారణంగా గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేయవు. ఎక్కడో కొన్ని రాష్ట్రాల్లో ఇందుకు మినహాయింపులు ఉంటాయి. ఇందుకు ఉదాహరణగా తమిళనాడు ప్రభుత్వాన్ని చెప్పుకోవచ్చు. కానీ ఏపీలో తమిళనాడు తరహా ప్రభుత్వ శైలిని ఊహించను కూడా ఊహించలేం. అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మధ్య అంతటి బద్ధవైరం ఉన్న సంగతి తెలిసిందే కదా. రాష్ట్రం విడిపోగానే బాబు ప్రభుత్వం ఏర్పడింది. ఆ తరువాత జగన్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం కొనసాగుతోంది.

బాబు ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలను జగన్ ప్రభుత్వం అమలు చేయలేదు. ఆ నిర్ణయాలు, అమలు చేయని కారణాలు చెప్పుకోవాలంటే చాలా పెద్ద కథ అవుతుంది. అమలు చేయకపోవడానికి జగన్ కారణాలు జగన్ కు ఉన్నాయి. అది వేరే సంగతి. చంద్రబాబు అధికారంలో (బీజేపీ కూడా భాగస్వామే అనుకోండి) ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా సమర్ధించింది. ఇది రాజకీయంగా కూడా చాలా ప్రభావం చూపించే నిర్ణయం. చంద్రబాబు చేసిన నిర్ణయాన్ని నేనెందుకు అమలు చేయాలని జగన్ పట్టుదలకు పొతే రాజకీయంగా కూడా చాలా నష్టం కలిగే అవకాశాలు ఉన్నట్లు అనిపిస్తోంది. 

ఇంతకూ అసలు కథ ఏమిటంటే ….ఏపీలో 2019లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రం తీసుకొచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో భాగంగా 5 శాతం కాపులకు కేటాయిస్తూ నిర్ణయించారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసారు. దీని పైన న్యాయపరమైన సందేహాలు తలెత్తాయి. ఇప్పుడు ఇదే అంశంపైన కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఏపీలో తీసుకున్న నిర్ణయం చట్టబద్దమేనన స్పష్టం చేసింది. 2014 ఎన్నికల సమయంలో కాపులను బీసీల్లో చేరుస్తామంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత తుని ఘటన అనంతరం కాపుల్లో బీసీలను చేర్చే అంశంపైన మంజునాధ కమిషన్ వేసారు. ఆ కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందింది.

అయితే, కమిటీ ఛైర్మన్ సంతకం లేకుండానే రిపోర్టు ప్రభుత్వానికి చేరింది. ఇటు కేంద్రం ఆర్దికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మేరకు ఏపీలో కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ నాటి ప్రభుత్వం తీర్మానం చేసింది. దీని పైన న్యాయ పరమైన సమస్యలు ఉన్నాయి. దీని పైన బీజేపీ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తాజాగా రాజ్యసభలో కేంద్రం నుంచి స్పష్టత కోరారు. కేంద్ర సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రి ప్రతిమ భౌమిక్ దీని పైన సమాధానం ఇచ్చారు. ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరంలేదని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని వెల్లడించారు. ఓబీసీ రిజర్వేషన్ అంశం రాష్ట్ర జాబితాలోని అంశం కాబట్టి 2019లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ చేసిన చట్టం చట్టబద్ధమేనని స్పష్టం చేసారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లుని ప్రవేశపెట్టింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోటా 10 శాతం కాగా ఇందులో 5 శాతం కాపులకు, మిగతా 5 శాతం ఇతర అగ్రవర్ణాలకు కల్పిస్తూ బిల్లులో పేర్కొంది. అయితే, దీని పైన వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అసెంబ్లీలోనూ చర్చ సాగింది.

అదే సమయంలో టీడీపీ హయాంలో జరిగింది ఏంటీ.. తమ విధానం ఏంటనే దాని పైన సీఎం జగన్ స్పష్టత ఇచ్చారు. కాపులను బీసీల్లో చేర్చాలనేది డిమాండ్ అయితే, ఈఢబ్ల్యూఎస్ కోటాలో కాపులకు అయిదు శాతం కేటాయించటం ద్వారా కాపులు బీసీలా.. ఓసీలా అనేది స్పష్టత లేకుండా చేసారని చెప్పుకొచ్చారు. కాపులు తమను బీసీల్లో చేర్చమని ఆందోళన చేస్తుంటే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో అయిదు శాతం కల్పించటం ద్వారా వచ్చే ప్రయోజనం ఏంటనేది వైసీపీ ప్రశ్న, పది శాతం రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ వర్గాల కింద ఉన్న వారికి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు విద్య- ఉద్యోగ రంగాల్లో ఉంటుందని చెబుతున్నారు.

కాపులకు సాధ్యమైనంత మేలు చేస్తామనే తాము చెప్పామని.. సాధ్యపడుతుందో లేదో తెలియని అంశాల పైన తాము మభ్య పెట్టే హామీలు ఇవ్వలేదని వైసీపీ నేతలు నాడు సభలో సీఎం చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అయితే, కేంద్రం ఇప్పుడు చంద్రబాబు నిర్ణయాన్ని సమర్ధిస్తూ నిర్ణయం చెప్పటంతో.. ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..ముఖ్యమంత్రి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ పెంచుతోంది. ఈ క్రెడిట్ చంద్రబాబుకు దక్కుతుందని జగన్ గమ్మున ఉండిపోతారా? మరో ప్రత్యామ్నాయం ఆలోచిస్తారా? చూడాలి.