రైల్వే జోన్ అలా సాగుతూనే ఉంటుందిట

ఇది శభాష్ అనదగ్గ మాట. పాలకులు అలాగే ఉండాలి కూడా. ఏదైనా పూర్తి చేస్తే ఒక్క రోజు చెప్పుకుని మరచిపోతారు. కానీ దాన్నే ఏళ్ళూ పూళ్ళూ సాగదీస్తే అది ఇంకా కళ్ల ముందే పడి…

ఇది శభాష్ అనదగ్గ మాట. పాలకులు అలాగే ఉండాలి కూడా. ఏదైనా పూర్తి చేస్తే ఒక్క రోజు చెప్పుకుని మరచిపోతారు. కానీ దాన్నే ఏళ్ళూ పూళ్ళూ సాగదీస్తే అది ఇంకా కళ్ల ముందే పడి ఉంటుంది. అలాంటిదే విశాఖ రైల్వే జోన్ వ్యవహారం కూడా. అదిగో ఇదిగో అంటూ మరో ఎన్నికకు కూడా దగ్గరకు తెచ్చేశారు కేంద్ర పెద్దలు. రైల్వే జోన్ ఎపుడు పూర్తి అవుతుంది అని అడగకూడదు. ఎందుకంటే అది అలా నిరంతరంగా సాగిపోయే ప్రక్రియ అని తాపీగా రైల్వే బోర్డు అధికారులు చెప్పి కళ్ళు తెరిపించారు కనుక.

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు అవుతుంది, అలాగే దాని కార్యకలాపాలు నిర్వహణ వంటి వాటి విషయంలో ఎలాంటి కాలపరిమితి పెట్టుకోలేదని రైల్వే బోర్డు అధికారులు తెలియచేస్తున్నారు. అందువల్ల అలా తాపీగా ఆ పని జరుగుతూ పోతుంది కంగారు ఎందుకు అన్నట్లుగానే అధికారుల వివరణ ఉంది.

విశాఖ రైల్వే జోన్ కోసం 2020-21లో రూ.170 కోట్లు కేటాయించినట్టు రైల్వే బోర్డు తెలిపింది. ఇందులో 106 కోట్ల రూపాయలు కేటాయించి రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి డిసైడ్ చేశామని కూడా పేర్కొన్నారు. 2022-23లో రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ కోసం ఆరు లక్షలు ఖర్చు చేశమని వివరిస్తున్నారు.

అందువల్ల రైల్వే జోన్ విషయంలో అన్నీ జరుగుతాయి. మళ్ళీ మళ్లీ ఎపుడు పూర్తి అంటూ ప్రశ్నలు వేయవద్దు అన్నట్లుగానే రైల్వే బోర్డు అధికారులు వివరణ ఇచ్చారు. బోర్డు అధికారులు చెప్పినట్లుగానే ఏదో నాటికి విశాఖకు రైల్వే జోన్ వచ్చి తీరుతుంది. అన్నీ పూర్తి అయి కార్యకలాపాలు కూడా మొదలవుతాయి. అది ఎపుడు అని అడిగి ఆయాసపడకూడదు, అడిగినా మళ్ళీ మళ్లీ ఇదే జవాబు వస్తుంది. వెనకటికి ఒక కవి ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు అని రాశారు. విశాఖ రైల్వే జోన్ చూస్తే ఒక అర్ధ శతాబ్ద కాలం లేటు అని మార్చి చదువుకుంటే చాలు.