శతృవు నైనా ఒక్కోసారి అభినందించాల్సిన సమయం వస్తుంటుంది. కనీసం మొక్కుబడిగానైనా ఓ సందేశం ఇవ్వాల్సి వస్తుంది. ఆంధ్ర సిఎమ్ జగన్ బర్త్ డే సందర్భంగా కొందరు మనసులోంచి అభినందనలు తెలిపారు. కొందరు మొక్కుబడి అభినందనలు అందించారు. కొందరు అస్సలు అభినందించలేదు. తప్పేం లేదు.
అందరికీ జగన్ నచ్చాలని లేదు కదా. అలా నచ్చని వాళ్లు మౌనం ఉత్తమం అన్నట్లు వుండిపోయారు..ఉండి పోవాలి. తప్పదు. కానీ ఒక్కరు మాత్రం జగన్ కు ఆ పుట్టిన రోజు పండగ సరదా కూడా లేకుండా చూడాలని ట్రయ్ చేసినట్లు కనిపిస్తోంది. అదే ఈనాడు దినపత్రిక.
ఈనాడు దినపత్రిక నిత్యం పతాక శీర్షికలో జగన్ వైఫల్యం ఇదీ, జగన్ మోసం ఇదీ, జగన్ దగా ఇదీ అన్నట్లు వార్తలు వండి వారుస్తుంటుంది. సరే, ఓ మీడియాగా దాని పని అది చేస్తోంది. అందువల్ల తప్పు పట్టడానికి లేదు. జగన్ చేసిన పనుల్లో ఒక్కటీ మంచి లేదు ఈనాడు దృష్టిలో. అదీ దాని దృక్కోణం అని సరిపెట్టుకుందాం.
కానీ కనీసం జగన్ పుట్టిన రోజు అయినా ఒక్క పాజిటివ్ న్యూస్ లేదా, పాజిటివ్ యాంగిల్ దర్శించగలిగితే ఎలా వుండేది? లేదు. తమకు అలా చేయడం ఇష్టం లేదు అనుకుందా. కనీస ఒక్క రోజు అయినా దగా చేసాడు..మోసం చేసాడు..జనాలకు అన్యాయం జరిగిపోతోంది అనే టైపు వార్తలు లేకుండా చూసుకోవచ్చు కదా.
జిల్లా పేజీల్లో అప్పుడప్పుడు అయినా జగన్ వల్ల ఊళ్లకు జరుగుతున్న మంచి పనుల వార్తలు రాస్తున్నారు. ఇంటింటికీ వైద్యుల్ని పంపించి చేస్తున్న కొత్త విధానాన్ని చూపిస్తున్నారు. కనీసం అలాంటి ఒకటి రెండు పాజిటివ్ వార్తలు అన్నీ ఫ్రంట్ పేజీలోకి తెచ్చి, ఆ విధంగా పుట్టిన రోజు ఆనందం కలిగించవచ్చు కదా.. ఎంత నెగిటివిటీ వున్నా, బర్త్ డే రోజన్నా దాన్ని కాస్త పక్కన పెట్టవచ్చు కదా.
అంటే పుట్టిన రోజున కూడా జగన్ ఆనందంగా వుండకూడదు..వుంచకూడదు అనే ఆలోచన ఏదన్నా వుందేమో.