భారతదేశంలో రోజుకు 63 మంది గృహిణులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏకంగా లోక్ సభలో వెల్లడించిన కఠోర వాస్తవమిది. అధికారిక లెక్కలే ఇలా ఉన్నాయంటే, అనధికారికంగా దేశవ్యాప్తంగా ఎంతమంది ఆడపడుచులు తమ ప్రాణాలు కోల్పోతున్నారో అర్థం చేసుకోవచ్చు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటాను కేంద్ర హోం శాఖ లోక్ సభలో వెల్లడించింది. 2021లో మొత్తం 42,004 మంది రోజువారీ వేతన జీవులు, 23,179 మంది గృహిణులు ఆత్మహత్య చేసుకున్నారని సభలో వెల్లడించింది.
మొత్తంగా గతేడాది 1,64,033 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. వీళ్లలో రోజువారీ కూలీలు, గృహిణులతో పాటు, వ్యాపారాలు, నిరుద్యోగులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, కౌలు సాగుదారులు ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది.
గృహ హింస చట్టాల్ని ఎంత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నప్పటికీ, మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా మహిళలపై అకృత్యాలు, గృహ హింస ఆగడం లేదని మహిళ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికారిక లెక్కల్లోనే 23,179 మంది గృహిణులు ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రకటించారంటే, అనధికారికంగా ఈ సంఖ్య 50వేలు దాటి ఉంటుందని ఆరోపిస్తున్నారు.