టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళిరెడ్డి అలియాస్ శివ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఇవాళ ఉదయం చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో టీటీడీ ఈవో కుమారుడు తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న గుండెపోటుకు గురైన శివ… ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేకపోయారని వైద్యులు ప్రకటించారు.
తీవ్రమైన దుఃఖంతో ధర్మారెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఆ యువకుడి మృతదేహాన్ని తీసుకుని స్వగ్రామమైన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గం పారుమంచాలకు తీసుకెళ్లారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వీటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరై, ధర్మారెడ్డిని ఓదార్చనున్నారు. జగన్‌కు అత్యంత నమ్మకమైన ఉన్నతాధికారిగా ధర్మారెడ్డి గుర్తింపు పొందారు.
ఇదిలా వుండగా ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని గురువారం సీఎం జగన్ పరామర్శించి, ఓదార్చనున్నారు. చెవిరెడ్డి తండ్రి సుబ్రమణ్యంరెడ్డి గత సోమవారం అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. బుధవారం ఆయనకు స్వగ్రామ మైన తుమ్మలగుంటలో అంత్యక్రియలు నిర్వహించారు. పుట్టిన రోజు సందర్భంగా జగన్ ఇవాళ అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. దీంతో ఆయన్ను పరామర్శించడానికి చెవిరెడ్డి స్వగ్రామమైన తుమ్మలగుంట వెళ్లనున్నారు.