జగన్ అంటే కఠినం…అందుకే నానా మాటలు

జగన్ అన్న మూడు అక్షరాలు చుట్టూ ఎన్నో రకాలైన విశ్లేషణలు అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు ప్రతి నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇపుడు మరో కొత్త విశ్లేషణ చేశారు జగన్ క్యాబినెట్ లో సీనియర్ మంత్రిగా…

జగన్ అన్న మూడు అక్షరాలు చుట్టూ ఎన్నో రకాలైన విశ్లేషణలు అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు ప్రతి నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇపుడు మరో కొత్త విశ్లేషణ చేశారు జగన్ క్యాబినెట్ లో సీనియర్ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు. ఆయన జగన్ అంటేనే కఠినం అని ఒక్క మాటలో తేల్చేశారు. జగన్ అలాగే ఉంటారని, ఉండాలని కూడా ధర్మాన కోరుకున్నారు.

వ్యవస్థలో మార్పు రావాలంటే జగన్ లా ఎవరో ఒకరు ముందుండాలని కఠినంగానే ఉండాలని అపుడే ఫలితాలు వస్తాయని ధర్మాన అన్నారు. జగన్ పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాయని వాటి ఫలితాలకు సమయం పడుతుందని ఇటీవలనే చెప్పిన ధర్మాన ఇపుడు జగన్ కఠినం అంటూ సంచలన కామెంట్స్ చేశారు. మార్పు కోసం జగన్ కష్టపడుతున్నారని కితాబు ఇచ్చారు.

జగన్ వంటి నేతలు ఉంటేనే వ్యవస్థలో రుగ్మతలు పోయి మంచి మార్పు వస్తుందని ధర్మాన ఆశాభావం వ్యక్తం చేశారు. అవినీతి లేని పాలనను తమ ప్రభుత్వం మూడున్నరేళ్ళుగా అందించింది అని తాను గట్టిగా చెబుతాను అని ఈ సీనియర్ మంత్రి ధీమాగా చెబుతున్నారు. తాను అవినీతికి వ్యతిరేకమని, తమ పార్టీ వారే కాదు, అధికారులు అంతా అలాగే ఉండాలని కోరుకుంటాను అని ధర్మాన చెప్పుకొచ్చారు.

అవినీతి చేసి వ్యవస్థలను పాడుచేశారని ఆయన చంద్రబాబు మీద మండిపడ్డారు. చంద్రబాబుకు కోట్ల రూపాయల ఆస్థి ఎలా వచ్చిందో చెప్పాలని ధర్మాన ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమాస్తుల మీద కేసులు వేస్తే కోర్టులో స్టేలు తెచ్చుకుంటారు తప్ప విచారణకు నిలబడరు అని ధర్మాన విమర్శించారు. అదే సమయంలో తాను అవినీతికి పాల్పడినట్లుగా నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఆయన సవాల్ చేశారు.

తమ పార్టీ నాయకులు కూడా అవినీతి పనులు చేయడం లేదని, టీడీపీ నేతల మాదిరిగా దోచుకుని తినడంలేదని ఆయన అన్నారు. ఆర్ధికంగా చితికిపోయినా వైసీపీలో జగన్ ఆశయం కోసం అంతా పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అవినీతి రహిత సమాజం కోసం జగన్ చేస్తున్న కృషికి మొత్తం వైసీపీ అండగా నిలబడింది అని ఆయన వివరించారు.

తమ నాయకుడు జగన్ అవినీతి మీద ఉక్కుపాదం మోపి కఠినంగా ఉండడం వల్లనే విపక్షాలు నానా మాటలు అంటున్నారని ధర్మాన ఆవేదన చెందారు. శ్రీకాకుళం గడప గడప కార్యక్రమంలో ధర్మాన వైసీపీ అవినీతి లేని ప్రభుత్వం అందిస్తోందని, వ్యవస్థలో సమ్మూల మార్పులను తెస్తోందని చెబుతూ విపక్షాలను టార్గెట్ చేశారు.