డ్రగ్స్ టెస్టుపై మంత్రి కేటీఆర్, తెలంగాణ బీజేపీ ఎంపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. విమర్శలు, ఆరోపణలు హద్దులు దాటుతున్నాయి. మంత్రి కేటీఆర్ సహనం కోల్పోయి … టీబీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌కు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కౌంటర్ ఇచ్చారు.
అసలు కేటీఆర్‌కు లవంగానికి, తంబాకుకు తేడా తెలియదని దెప్పి పొడిచారు. డ్రగ్స్ టెస్టు ప్రస్తావన తీసుకొచ్చిందే మంత్రి కేటీఆర్ అని ఆయన గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలని కేటీఆర్ సవాల్ విసిరారని చెప్పుకొచ్చారు. విమర్శలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా టెస్టు చేయించుకోవాలని అర్వింద్ ఉచిత సలహా ఇచ్చారు. టెస్ట్ చేయించుకోవడం వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని వెటకరించారు.
నీ గోర్లు, జుట్టు, చర్మం ఎవరికి కావాలంటూ కేటీఆర్‌ను అర్వింద్ నిలదీశారు. మునుగోడు, దుబ్బాకలో చేసిన వాగ్దానాలు మర్చిపోయి ఇప్పుడు డ్రగ్స్ గురించి ఎందుకని ఆయన ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటున్నాయన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఉన్నారని రుజువైతే ఆమె జైలుకు పోతారన్నారు. అలాగే ఫినిక్స్ లో కేటీఆర్ పేరు ఉంటే అతను కూడా అంతే అంటూ అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.