నీటిని గంగతో పోల్చి చూస్తారు. పవిత్రం అంటే గంగ నీరే అని చెబుతారు. ఇపుడు నీరు గాలీ సర్వం కాదేదీ కలుషితం అన్నట్లుగా తయారయిపోయాయి. దాంతో మనిషి ఆరోగ్యం మీద ఆధునిక జీవితం తెలియకుండానే దెబ్బ కొడుతోంది. పట్టణీకరణ పెరిగిపోవడం, అంతా కలసి ఒకే చోట కిక్కిరిసిపోవడం వల్లనే గాలి నీరు సైతం పూర్తిగా కాలుషితం అయిపోతున్నాయని నిపుణుల నివేదికలు చెబుతున్నాయి.
అయితే దేశంలో గాలి కాలుష్యం అయింది. అలా ఏ ఏటికి ఆ ఏడు గాలి కాలుష్య నగరాల జాబితా కొండవీటి చాంతాడు మాదిరిగా పెరుగుతూపోతోంది. ఆ జాబితాలో విశాఖ కూడా ఈ మధ్య దాకా ఉంది. దాంతో విశాఖ వాసులు కలవరపడ్డారు. విశాఖ ప్రేమికులు సైతం కలత చెందారు.
ఇపుడు అందరికీ ఒక శుభవార్తనే కేంద్ర పర్యావరణ శాఖ వినిపించింది. విశాఖ గాలి పవిత్రం అంటూ లోక్ సభ సాక్షిగా కేంద్రం తాజాగా ప్రకటించింది. ఏపీలోని నాలుగు ప్రధాన నగరాల్లో గాలి కాలుష్యం 2022లో బాగా తగ్గిందని వచ్చిన నివేదికలను వెల్లడించింది.
విశాఖ ఏపీలో మెగా సిటీ. విశాఖ వరకూ చూసుకుంటే 2020-21 నుంచి 2021-22 మధ్య కాలంలో ప్రతి ఘనపు మీటర్ గాలిలో 104 దాక ఉండే ధూళి కణాలు ప్రస్తుతం 98కి తగ్గాయి. ఇలా వాయుకాలుష్యం తగ్గిన సిటీలలో విశాఖ ముందుంది. రానున్న రోజుల్లో మరింతగా తగ్గుతుందని కూడా నిపుణులు అంటున్నారు.
విశాఖలో అమలవుతున్న క్లీన్ అండ్ గ్రీన్ విధానం వల్ల కూడా కాలుష్య మేఘాలు తప్పుకుంటున్నాయి. పెరుగుతున్న నగరాలలో పచ్చదనం కూడా ఉంటే గాలి ఎపుడూ పవిత్రంగా పదిలంగా ఉంటుందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. విశాఖ విషయంలో ప్రభుత్వాలు పారిశ్రామిక సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లనే ఇపుడు గాలి హాయిగా గుండె నిండా పీల్చుకునే పరిస్థితి ఉందని చెప్పవచ్చు.