బాలయ్య అల్లుడు..లోకేష్ బాబు తోడల్లుడు..తెలుగుదేశం కీలక నేత మనవడు…ఇంత ప్రొఫైల్ వుండీ జస్ట్ మూడు కోట్లు బిల్లు విడుదల చేయించుకోలేకపోయారు. ఇదేం అపవాదు. లేని మాట కాదు. సాక్షాత్తూ బాలయ్య చిన్న అల్లుడు, తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి భరత్ చెప్పిన మాటే.
గత ప్రభుత్వ హయాంలో ఎన్ని సార్లు విన్నవించినా కూడా ట్రాన్స్ కో కు పంపిణీ చేసిన విద్యుత్ కు సంబంధించిన మూడు కోట్ల బిల్లు అలాగే పెండింగ్ వుండిపోయిందని, ఆ అమౌంట్ వచ్చి వుంటే ఆంధ్రాబ్యాంక్ బాకీకి కట్టివుండేవారమని భరత్ అన్నారు.
భరత్ బిల్లు అది కూడా మూడు కోట్లు రాలేదంటే ఆలోచించాలి. ఎందుకంటే మామగారి ద్వారానో, మరో విధంగా భరత్ ప్రయత్నించకుండా వుండి వుండరు. అయినా రాలేదు అంటే ఎవరో కీలకమైన వారే అడ్డం పడి వుండాలి. భరత్ మొన్నటి ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేయాలి అనుకున్నపుడు కూడా టికెట్ అంత సులువుగా రాలేదు.
ఆఖరికి ఆయన భాహాటంగా తిరుగుబాటు బావుటా ఎగరేసే పరిస్థితులు కనిపించాయి. అప్పుడు టికెట్ ఇచ్చారు. ఇదంతా గమనిస్తే భరత్ కు తెలుగుదేశం హోమ్ డిపార్ట్ మెంట్ లోనే అప్పోజిషన్ వుందేమో అని అనుకోవాలి.