తాజ్ మహల్ ను జప్తు చేస్తామంటూ నోటీసులు

తాజ్ మహల్.. విదేశీ పర్యటకుల దృష్టిలో ఇది భారత ముఖచిత్రం. ఏటా లక్షలాది మంది పర్యాటకుల్ని ఆకర్షించే కేంద్రం. 370 ఏళ్ల చరిత్ర దీని సొంతం. ఇలాంటి కట్టడానికి నోటీసులు జారీ చేసింది ఆగ్రా…

తాజ్ మహల్.. విదేశీ పర్యటకుల దృష్టిలో ఇది భారత ముఖచిత్రం. ఏటా లక్షలాది మంది పర్యాటకుల్ని ఆకర్షించే కేంద్రం. 370 ఏళ్ల చరిత్ర దీని సొంతం. ఇలాంటి కట్టడానికి నోటీసులు జారీ చేసింది ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్. ఒకటి కాదు, ఏకంగా 2 నోటీసులు పంపించింది.

నీటి పన్ను కట్టాలంటూ ఓ నోటీసు, ఆస్తి పన్ను కట్టాలంటూ మరో నోటీసు జారీచేసింది మున్సిపల్ శాఖ. కోటి రూపాయలకు పైగా బకాయి పడ్డారని ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. 

ఈ నోటీసులు చూసి భారత పురావస్తు శాఖ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 3 శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన తాజ్ మహల్ కు నోటీసులివ్వడంతో అవాక్కయింది. నిజానికి ఇలాంటి పురాతన కట్టడాలు, సంస్కృతిక చిహ్నాలకు పన్నులు వర్తించవు. నిబంధనల్లో ఇది స్పష్టంగా ఉన్నప్పటికీ నోటీసులు ఎందుకొచ్చాయో తమకు తెలియడం లేదని, బహుశా సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

మరో పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. అసలు తాజ్ మహల్ కట్టడానికి మున్సిపల్ వాటర్ కనెక్షన్ లేదు. అయినప్పటికీ లక్షల్లో బిల్లు చెల్లించాలంటూ నోటీసు వచ్చింది. 

ఇక్కడితో ఈ వ్యవహారం ఆగలేదు. ప్రసిద్ధ ఆగ్రా కోటాకు కూడా నోటీసులందాయి. ఆస్తి పన్ను కింద 5 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. చారిత్రక కట్టడాలకు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదంటూ కోట నిర్వహకులు మున్సిపల్ ఆఫీస్ కు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.