రాజన్న సిరిసిల్ల జిల్లాలో షాలినీ అనే యువతి కిడ్నాప్ వ్యవహారంలో అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటీవల రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన దంత వైద్యురాలు డాక్టర్ వైశాలి కిడ్నాప్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. నవీన్‌రెడ్డి అనే యువకుడు తనను పెళ్లి చేసుకోవాలని డాక్టర్ వైశాలిని బలవంతం చేయడం, ఆమె అంగీకరించక పోవడంతో ఏకంగా ఇంటిపైన్నే దాడి చేసి ఎత్తుకెళ్లడం సంచలనం రేకెత్తించింది. డాక్టర్ వైశాలి కిడ్నాప్‌నకు పదుల సంఖ్యలో నవీన్ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు పాల్గొన్నారు. సినీ ఫక్కీలో ఇది జరిగింది.
తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో మంగళవారం ఉదయం షాలినీ అనే యువతిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారనే వార్త ఆందోళన కలిగించింది. యువతిని బలవంతంగా కారులో ఎక్కించి లాక్కెళ్లే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో పోలీసులు కిడ్నాపర్ల కోసం వేట మొదలు పెట్టారు. ఆ తర్వాత కొన్ని గంటలకు సోషల్ మీడియాలో షాలినీ ఓ వీడియో విడుదల చేసింది.
ఓ యువకుడితో పెళ్లి దుస్తుల్లో షాలినీ ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యపరిచింది. ముఖాలకు మాస్కులు ధరించి వుండడం వల్ల కిడ్నాపర్లు అనుకున్నానని, అది నిజం కాదని ఆమె అన్నారు. తనకు తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేసేందుకు ప్రయత్నిం చడంతో జానీ వెంట వెళ్లినట్టు తెలిపింది. తనకిష్టమైన జానీ అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్టు ఆ యువతి తెలిపింది. నాలుగేళ్లుగా పరస్పరం ప్రేమించుకుంటున్నామని పేర్కొంది. అయితే కులాలు వేర్వేరు కావడంతో తన తల్లిదండ్రులు జానీతో పెళ్లికి అంగీకరించలేదని పేర్కొంది.
ఏడాది క్రితమే తామిద్దరం పెళ్లి చేసుకున్నామని, అయితే అప్పటికి మైనర్లు కావడంతో వివాహం చెల్లలేదని షాలినీ చెప్పుకొచ్చింది. అతన్ని జైల్లో పెట్టారని తెలిపింది. అప్పట్లో తనను ఇంటికి తీసుకెళ్లారని షాలినీ వివరించింది. తన తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని వున్నట్టు షాలినీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా వుండగా పెళ్లికి సంబంధించి ఫొటోలు, వీడియోలను ఆమె సోషల్ మీడియాలో విడుదల చేయడంతో కిడ్నాప్ ప్రచారం డ్రామా అని తేలిపోయింది.