దేశంలో ఎవర్‌గ్రీన్ రంగం ఏదైనా వుందంటే… అది రసాయనిక పరిశ్రమే. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి జాతీయ సంస్థలో తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తికి చోటు దక్కింది. దేశంలో పది మంది ధనవంతుల గురించి ఆరా తీస్తే… వారిలో ఆరుగురు ఫార్మాస్యూటికల్ రంగానికి చెందిన వారే వుంటారు. రసాయనిక పరిశ్రమకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను కేంద్ర ప్రభుత్వం నెలకొల్పింది. ఈ సంస్థ కౌన్సిల్ మెంబర్‌గా డాక్టర్ గురుమూర్తిని కేంద్ర ప్రభుత్వం నియమించడం విశేషం. ఇది స్వయంప్రతిపత్తి గల సంస్థ.
ఈ సంస్థ దేశంలోనే కాకుండా అగ్నేయాసియా, దక్షిణాసియా, ఆఫ్రికా దేశాలకు కూడా రసాయన ఎగుమతులు, దిగుమతులు, శాస్త్రసాంకేతిక సహాయ సహకారాలను అందించడానికి దోహదపడుతుంది. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ఏపీలో ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు నెలకొల్పడానికి, అలాగే ఆ రంగంలో ఉన్న పరిశ్రమల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
ఏపీకి వీలైనంత ఎక్కువగా రసాయనిక పరిశ్రమల ద్వారా ఆదాయం పెంచేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు.