మళ్లీ కరోనా వ్యాప్తి మానవాళిని భయపెడుతోంది. మళ్లీ అదే దేశంలో కరోనా విజృంభిస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నారు. కరోనా మహమ్మారి పేరు వింటే చాలు… నిలువెల్లా వణికిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో చైనాలో కరోనా నిబంధనలను సడలించిన తర్వాత… ఆ మహమ్మారి విజృంభిస్తోంది. చైనాలో వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడ్డారని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఎరిక్ ఫీగెల్ డిల్ ప్రకటించారు.
దీంతో మహమ్మారి మళ్లొకసారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందనే అనుమానం, భయం వెంటాడుతోంది. మరో మూడు నెలల్లో చైనాలో 60 శాతం పైగా జనం కరోనాబారిన పడొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రపంచ జనాభాలో పది శాతం మంది కరోనాబారిన పడుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కరోనాకు కేరాఫ్ అడ్రస్ చైనా దేశమనే సంగతి తెలిసిందే. కరోనా సృష్టికి కారణమైందని చైనాపై ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఆగ్రహంగా ఉన్నాయి. అదేంటో గానీ, మళ్లీ అదే దేశంలోనే కరోనా వ్యాప్తి మొదలైంది. శరవేగంగా కరోనా వ్యాప్తిస్తుండడం ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. ఎందుకంటే కరోనాతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడింది. లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. చిన్నాపెద్దా, పేదధనిక అనే తేడా లేకుండా కోట్లాది మంది ప్రాణాల్ని కరోనా బలి తీసుకుంది.
ఆ మహమ్మారి పంజా విసరవడంతో పిల్లలకు తల్లి లేదా తండ్రి… మరికొందరికి తల్లీదండ్రి ఇద్దరూ లేకుండా పోయారు. తల్లిదండ్రు లకు చేతికొచ్చిన కొడుకు లేదా కూతుర్ని దూరం శాశ్వతంగా దూరం చేసింది. భార్యకు భర్తను, భర్తకు భార్యని లేకుండా చేసింది. కరోనా అనే మహమ్మారి ప్రతి కుటుంబానికి ఓ చేదు జ్ఞాపకాన్ని మిగిల్చిపోయింది.
అందుకే ఆ మహమ్మారి పేరు వినడానికి కూడా భయపడుతున్న పరిస్థితి. మళ్లీ చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నాయంటే…. మన దగ్గరికి వస్తుందేమోననే ఆందోళన. మహమ్మారిని ఎదుర్కోడానికి మానసికంగా సిద్ధం కావడం తప్ప, ఏమీ చేయలేమా? గత కరోనా అనుభవాల రీత్యా ముందస్తు చర్యలపై ప్రభుత్వాలు శ్రద్ధ పెడితే మంచిది.