ప్రశ్నించడం తప్ప సమాధానాలు చెప్పడం తమ పనికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ భావనగా ఉన్నట్టుంది. వ్యక్తిగతంగా తనతో పాటు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థలపై వచ్చే విమర్శలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వుందని రామకృష్ణ అసలు భావించరు. ఏపీ అప్పులపై రామకృష్ణ ఘాటుగా స్పందించారు. శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేయడం గమనార్హం.
ఎల్లో మీడియాలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనం రాస్తే …అదేదో అధికారిక లెక్కలన్నట్టుగా రామకృష్ణ విమర్శిస్తున్నారు. ఏపీలో కార్పొరేషన్ల రుణాలతో సహా అన్ని రకాల అప్పులు దాదాపు రూ.8 లక్షల కోట్లకు పైగానే వుందని ఎల్లో మీడియా రాతలకు వత్తాసు పలుకుతూ ఆయన విమర్శలు గుప్పించారు. విచ్చలవిడిగా అప్పులు చేయడాన్ని ఎవరూ సమర్థించరు. తప్పకుండా ప్రశ్నించాలి, నిలదీయాలి.
ఏపీలో సంక్షేమ పథకాల అమలు కోసమే జగన్ సర్కార్ అప్పులు చేస్తున్న సంగతి రామకృష్ణకు తెలియదని అనుకోలేం. జనానికి పంచి పెట్టడాన్ని బూర్జువాల పార్టీలు తప్పు పడితే అర్థం చేసుకోవచ్చు. పేదలు, కార్మికులు, కర్షకుల పార్టీగా పేరున్న కమ్యూనిస్టు పార్టీలు ఆరోపిస్తేనే… సదరు నాయకుడిలో ఏదో తేడా వుందనే అనుమానాలొస్తాయి. ప్రభుత్వాలు, పార్టీలు పారదర్శకంగా వుండాలని రామకృష్ణ కోరుకోవడాన్ని స్వాగతిద్దాం.
ఇదే సందర్భంలో తన పార్టీ, దాని అనుబంధ సంస్థలు సమాజానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా? లేదా? అనే ప్రశ్నకు రామకృష్ణ సమాధానం చెప్పాలి. పుస్తకం వేసి ఎవరు సంతోషంగా ఉన్నారు?’అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి సాహిత్య పేజీలో ఆ మధ్య ఓ వ్యాసం ప్రచురితమైంది. ఈ వ్యాసంలోని కొన్ని వాక్యాలను గమనిద్దాం.
‘తెలుగు రచయితలకు అదేమి దురదృష్టమోకాని పుస్తకాన్ని ప్రచురించిన ప్రచురణకర్త రచయితకు సొమ్ము లివ్వడు. పైగా వెయ్యి కాపీలు ముద్రించామని చెప్పి రెండు వేల కాపీలు వేసుకుంటాడు. పోనీ అని పాపం ఆ రచయితలే స్వంతధనంతో పుస్తకాన్ని ముద్రించుకొని అమ్మి పెట్టమని పుస్తక విక్రేతలకిస్తే ఒక్కడూ అమ్మి సొమ్ములు జేబులో వేసుకోవటమేగాని రచయితకు పైసా విదల్చడు. పుస్తకాలు తీసుకొనే సమయంలో నలభై, యాభై శాతం కమీషన్ తీసుకుంటామని చెబుతారు. కాని ఆచరణలో చూస్తే అది నూరు శాతం కమీషన్‌గా మారుతుంది. రచయితల్ని ఈ రకంగా దోపిడీ చేస్తున్నవారు ఊరూ పేరూ లేనివారు కాదు. తెలుగు రాష్ట్రాల్లో చెరో డజను విక్రయ కేంద్రాల్ని నడుపుతున్న వామపక్ష భావజాల ప్రేరితాలుగా చెప్పుకునే పాపులర్ పుస్తక విక్రయ కేంద్రాలు’
వామపక్ష భావజాల ప్రేరిత పాపులర్ పుస్తక విక్రయ కేంద్రాలుగా విశాలాంధ్ర, ప్రజాశక్తి పేరు పొందాయి. ఇందులో విశాలాంధ్ర సీపీఐ, అలాగే ప్రజాశక్తి పుస్తక విక్రయ సంస్థ సీపీఎంకు చెందినవి. ఈ రెండు పుస్తక విక్రయ సంస్థలు రచయితలను ఏ విధంగా దోపిడీ చేస్తాయో ఆ వ్యాసం చదివిన వారికి బాగా అర్థమవుతుంది. ఈ ఆరోపణలపై సమాధానం చెప్పాలని వామపక్ష నేతలకు ఆలోచన రాకపోవడం గమనార్హం. ముందు తాము శుద్ధంగా వుండి, ఇతరులపై వేలెత్తి చూపితే బాగుంటుందనే పౌర సమాజం హితవు పలుకుతోంది.