సంక్రాంతి సినిమాల విడుదలకు ఇవాళ్టి నుంచి సరిగ్గా నెల రోజులు మాత్రమే టైమ్ ఉంది. ఓ పెద్ద సినిమా ప్రచారానికి నెల రోజుల టైమ్ అంటే చాలా తక్కువనే చెప్పాలి. కానీ బాలయ్య, చిరంజీవి సినిమాల ప్రచారాలు మాత్రం ఇంకా ఓల్డ్ స్టయిల్ లోనే జరుగుతున్నాయి.
నెల రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని, ఇంకా లిరికల్ వీడియోస్ తోనే కాలక్షేపం చేస్తున్నాయి ఈ రెండు సినిమాలు.
ప్రచారం కొత్త పుంతలు తొక్కుతున్న రోజులివి. ఓ పెద్ద సినిమాకు 2 నెలల ముందు నుంచే ప్లాన్ చేసి మరీ పక్కాగా, పకడ్బందీగా ప్రచారం నిర్వహిస్తున్న కాలంలో ఉన్నాం మనం. ఇలాంటి టైమ్ లో వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు మాత్రం ప్రచారం విషయంలో చాలా వెనకబడ్డాయి.
ఇప్పటివరకు ఈ రెండు సినిమాల నుంచి కేవలం సాంగ్స్ మాత్రమే విడుదలవుతున్నాయి. త్వరలోనే మరికొన్ని పాటలు రిలీజ్ కాబోతున్నాయి.
నిజానికి సాంగ్స్ మాత్రమే సరిపోవు. మారిన పరిస్థితుల నేపథ్యంలో మరింత మంది ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలన్నా, ప్రత్యర్థి సినిమాపై పైచేయి సాధించాలన్నా ప్రచారాన్ని కొత్త తరహాలో తీసుకెళ్లాలి.
ఈ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి సినిమాలు రెండూ ఈ నిర్మాణ సంస్థవే. వాటి ఫలితాల్ని అనుభవించాల్సిన నిర్మాతలు కూడా వీళ్లే. ఈ విషయంలో మైత్రి నిర్మాతలపై , అలాగే చిరు, బాలయ్య పై ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.
లిరికల్ సాంగ్స్ సంగతి సరే, అసలైన కంటెంట్ ఎక్కడంటూ సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. ఏదేమైనా ప్రమోషన్స్ గురించి ఫ్యాన్స్ తో చెప్పించుకునే స్టేజ్ కు వచ్చేసింది ఈ అగ్ర నిర్మాణ సంస్థ. మరికొన్ని రోజుల్లో ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తవుతున్నాయి. బహుశా, ఆ తర్వాత ప్రమోషన్స్ లో జోరు చూపిస్తారేమో..! అప్పటికి ఎంత టైమ్ మిగులుతుంది?