పుష్ప-2 అప్ డేట్ పై జరిగిన లొల్లి అంతా ఇంతా కాదు. అదిగో, ఇదిగో అంటూ సరిగ్గా ఏడాది లాక్కొచ్చారు. ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఓవైపు షూటింగ్ నడుస్తున్నప్పటికీ.. అందులో కూడా కన్ఫ్యూజన్. షూటింగ్ జరగట్లేదని కొంతమంది, షూట్ జరుగుతుందని మరికొంతమంది వాదించుకోవడమే పనైపోయింది. ఒక దశలో ఏకంగా బన్నీ ఫ్యాన్స్, బ్యానర్లు కట్టి ఆఫీస్ ముందు ధర్నా చేశారు.
ఈ మొత్తం ప్రహసనంపై క్లారిటీ ఇచ్చే టైమ్ వచ్చేసింది. పుష్ప-2 హీరో అల్లు అర్జున్, ఆ సినిమా దర్శకుడు సుకుమార్ ఒకే స్టేజ్ పైకి వచ్చారు. అదే 18-పేజెస్ ప్రీ రిలీజ్ ఫంక్షన్.
ఈ సినిమా సంగతి పక్కనపెడితే.. ఈ ప్రీ రిలీజ్ వేడుక వేదికపై పుష్ప-2 అప్ డేట్ వస్తుందని బన్నీ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. పుష్ప-2 బ్యానర్లతో మరోసారి హంగామా చేశారు. అయితే అల్లు అర్జున్ మాత్రం తన సొంత ఆర్మీకి అందంగా హ్యాండ్ ఇచ్చాడు. నవ్వుతూనే, ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా ఇంటికెళ్లిపోయాడు.
పుష్ప-2 అప్ డేట్ తను ఇవ్వాల్సిందిపోయి, అప్పటికే ప్రసంగం పూర్తిచేసిన సుకుమార్ పై తోసేశాడు బన్నీ. ఈసారి అప్ డేట్ ఇవ్వకపోతే సినిమా డైలాగ్స్ లీక్ చేస్తానంటూ సుకుమార్ కు స్వీట్ వార్నింగ్ ఇస్తూనే.. ఏడాదిగా చెబుతూ వస్తున్న 'అస్సలు తగ్గేదేలే' డైలాగ్ ను మళ్లీ రిపీట్ చేసి ముగించేశాడు.
మొన్న కొరటాల.. ఇప్పుడు సుకుమార్..
మొన్నటికి మొన్న ఆచార్య సినిమా డిజాస్టర్ అయితే, అంతా కలిసి కొరటాలను కార్నర్ చేశారు. తప్పంతా ఆయనదే అన్నట్టు కాంపౌండ్ నుంచి వరుస కథనాలు వచ్చేశాయి. ఇప్పుడు దాదాపు అదే పని బన్నీ చేశాడు. పుష్ప-2 ఆలస్యానికి కారణం సుకుమార్ అనే విధంగా పరోక్షంగా స్పందించాడు. సుకుమార్ ను తను చాలా లవ్ చేస్తానని, అందుకే పుష్ప-2 షూట్ లేట్ అయినప్పటికీ సుకుమార్ ను ఏం అనలేకపోతున్నానని అనేశాడు.
అంటే.. తన తప్పు లేదని, ఏడాదిగా సినిమా లేట్ అవ్వడానికి సుకుమారే కారణమనే అర్థం వచ్చేలా కామెంట్ చేశాడు బన్నీ. ఈ సంగతి పక్కనపెడితే.. కనీసం పుష్ప-2 షూటింగ్ నడుస్తోందని కూడా చెప్పలేదు బన్నీ. ఈ మధ్య గ్లింప్స్ అంటూ ప్రచారం జరిగింది. దానిపై కూడా క్లారిటీ ఆశిస్తే అత్యాశ అవుతుందేమో..!