అక్కడ.. ఇక్కడ ఎందుకు అనుకున్నాడేమో.. ఓ దొంగ ఏకంగా పోలీస్ ఇంటికే కన్నం వేశాడు. ఎంచక్కా ఇంట్లో ఉన్న బంగారం, నగలు దోచుకెళ్లాడు. వీటి విలువ కనీసం 20 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.
నల్గొండలోని దేవరకొండ రోడ్డు చైతన్యపురి కాలనీలో ఎస్సై లాక్యానాయక్, తన కుటుంబంతో నివశిస్తున్నాడు. ఆయన భార్య, కూతురు కుటుంబ వ్యవహారాల మీద హైదరాబాద్ వెళ్లారు. మరోవైపు డ్యూటీతో భర్త బిజీ.
ఇవన్నీ గమనించిన ఓ దొంగ, ఓ రాత్రి వేళ ఆ ఇంటికి కన్నంవేశాడు. బీరువా తెరిచి అందులో ఉన్న 20 తులాల బంగారం, 8 లక్షల రూపాయల డబ్బు దోచుకెళ్లాడు. ఉదయం లేచి చూసిన చుట్టుపక్కలవాళ్లకు తలుపు తెరిచి ఉండడం చూసి, అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీస్ ఇంట్లోనే దొంగలు పడ్డంతో డిపార్ట్ మెంట్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. క్లూస్ టీమ్ వచ్చి అన్ని రకాల ఆధారాలు సేకరించింది. వీలైనంత త్వరగా దొంగను పట్టుకుంటామంటున్నారు పోలీసులు. చెప్పడం కాదు, ఎలాగైనా పట్టుకోవాల్సిందే. ఎందుకంటే పోలీసోడి ఇంట్లో పడిన దొంగనే పట్టుకోలేదంటే, అది డిపార్ట్ మెంట్ కే పరువు తక్కువ.