సంచయిత గజపతిరాజు. ఆరు నెలలుగా ఈ పేరు మారుమోగుతోంది. పూసపాటి గజపతులు మూడవ తరం వారసురాలిగా రంగంలోకి దిగిన వెంటనే సింహాచలం దేవస్థానానికి చైర్ పర్సన్ అయిపోయారు. అదే పెన్నుతో మరో సంతకం చేసి మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ అయిపోయారు. ఎవరీ అమ్మాయి, ఇంత పెద్ద బాధ్యతలు ఎలా అప్పగించారు. ఆమె భరించగలదా అన్న నోళ్ళే అమ్మో గడుగ్గాయే అని అనుకునేలా అరు నేల్లోనే సీన్ మొత్తం రివర్స్ చేసిన ఘనత సంచయితదే.
పూసపాటి వంశీయులు అంటే పెద్దాయన అశోక్ గజపతిరాజే గుర్తువచ్చే చోట కొత్త పెత్తందారుగా అవతరించిన సంచయిత ఓ వైపు తన బాధ్యతలను చూసుకుంటూనే మరో వైపు బాబాయ్ అశోక్ హయాంలో అటు సంస్థానం పరంగా, ఇటు రాజకీయంగా జరిగిన లోటుపాట్లు ఎప్పటికపుడు సోషల్ మీడియా వేదికగా ఏకేస్తున్నారు.
మూడు లాంతర్ల వివాదం తెరపైకి వచ్చినపుడు విజయనగరం చారిత్రక సంపదగా ఉన్న నాటి కట్టడాలు ఎలా కనిపించకుండా చేశారో అంటూ బాబాయ్ మీద విసుర్లే విసిరారు. ఇక మాన్సాస్ ట్రస్ట్ ఆస్తుల పరిరక్షణ విషయంలోనూ శ్రద్ధ పెట్టలేదని విమర్శలు కురిపించారు.
ఇపుడు తాజాగా సంచయిత బాబాయ్ మీద ఎక్కుపెట్టిన రాజకీయ బాణాలతో పెద్దాయనకు ఇబ్బందిగానే ఉందిట. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయం, పలు మార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర, కేంద్ర మంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన అశోక్ గజపతి హయాంలో విజయనగరం ఏం బాగుపడింది అంటూ సంచయిత సూటిగానే ప్రశ్నిస్తున్నారు.
ఇక అభివ్రుధ్ధికి తానే అంబాసిడర్ని అని చెప్పుకునే చంద్రబాబుకు విజయనగరం వెనకబాటుతనం ఎందుకు పట్టలేదని కూడా ఆమె అడుగుతున్నారు. తన తాత పీవీజీ రాజు పేరు చెప్పుకునే పబ్బం గడుపుకున్నారు తప్ప విజయనగరానికి చేసింది లేదని కూడా సంచయిత ఘాటుగానే తగులుకున్నారు.
ఇక విజయనగరం, విశాఖ ప్రాంతాలను కలుపుతూ జంట నగరాలుగా అభివ్రుధ్ధి చేయడానికి జగన్ సర్కార్ తయారు చేసిన బ్లూ ప్రింట్ బాగుందని చెప్పడం ద్వారా టీడీపీ పాలనలో, బాబాయ్ ఏలుబడిలో ఆ ప్రాంతం ఏమీ ప్రగతి సాధించలేదని మొహమాటం లేకుండానే సంచయిత హాట్ కామెంట్స్ చేశారు. మొత్తానికి సంచయిత దూకుడు రాజకీయానికి కెరాఫ్ అడ్రస్ అయిపొయారు.