సినిమా ఫ్లాప్ అయితే హీరోలు ఒక్కొక్కరు ఒక్కోలా ఆ ఫ్లాప్ నుంచి బయటపడ్డానికి ప్రయత్నిస్తుంటారు. ప్రభాస్ అయితే ఫ్లాప్ వస్తే రోజంతా నిద్రపోతాడంట. రాజ్ తరుణ్ అయితే ఎవ్వరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోతుంటాడు. మహేష్ అయితే రిలీజ్ రోజు అస్సలు దేశంలోనే ఉండడు. ఇలా ఒక్కో హీరో ఒక్కో రకంగా ఫ్లాప్ ను హ్యాండిల్ చేస్తారు. ఆది సాయికుమార్ కూడా తన అలవాటును బయటపెట్టాడు. ఫ్లాప్ వస్తే గోవా వెళ్లిపోతానంటున్నాడు ఈ హీరో.
“ఫెయిల్యూర్స్ పట్టించుకోకుండా ఎలా ఉంటాం. కచ్చితంగా అసంతృప్తి ఉంటుంది. నేను మాత్రం గోవా వెళ్లిపోతాను. ఫ్లాప్ అని తెలిసిన వెంటనే గోవా వెళ్లిపోయి, ఓ 2-3 రోజులు పూర్తిగా రిలాక్స్ అయి వస్తాను. ఆ తర్వాత మళ్లీ కొత్త సినిమా స్టార్ట్ చేస్తాను. అంతకుమించి పెద్దగా బాధపడను. మనం చేసే సినిమాలు కచ్చితంగా హిట్ అవుతాయని చెప్పలేం. వంద సినిమాలొస్తే 5-6 మాత్రమే ఆడుతున్నాయి. ఆ ఐదారు సినిమాల్లో ఉండడానికే ప్రయత్నం.”
ఈహీరో నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ తాజాగా థియేటర్లలోకి వచ్చింది. రిలీజైన మొదటిరోజే సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చేసింది. ఆది సాయికుమార్ నటించిన ఎన్నో ఫ్లాప్ సినిమాల్లో ఇది కూడా ఒకటిగా మిగిలింది. సో.. ఈసారి కూడా ఆది సాయికుమార్ గోవా వెళ్లడం ఖాయమన్నమాట. మరోవైపు అసలు ఈ సినిమాలో నటించడానికి ఎందుకు ఒప్పుకున్నాననే విషయాన్ని బయటపెట్టాడు ఆది.
“ఆపరేషన్ గోల్డ్ ఫిష్ లో అర్జున్ పండిట్ అనే క్యారెక్టర్ ను ఒకే లైన్ లో చెప్పి ఉంటే చేసే వాడ్ని కాదేమో. వద్దులే తర్వాత చూద్దాం అని చెప్పి పంపించేసేవాడ్ని. కానీ కథ మొత్తం విన్న తర్వాత నచ్చి వెంటనే చేశాను. ఆ సినిమాలో ఎన్ఎస్జీ కమాండో లుక్ నాకు మాత్రమే కాదు, మా డాడీకి కూడా చాలా బాగా నచ్చింది. అందుకే వెంటనే నటించడానికి ఒప్పుకున్నాను.”
సినిమా కథ నచ్చితే విలన్ గా కూడా నటించడానికి ఓకే అంటున్నాడు ఆది సాయికుమార్. కథ మొత్తం విన్న తర్వాత, తన పాత్ర చాలా ఇంపార్టెంట్ అని తనకు అనిపిస్తే ప్రతినాయకుడిగా కూడా నటిస్తానని ప్రకటించాడు ఆది సాయికుమార్.