cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: రాజుగారి గది 3

సమీక్ష: రాజుగారి గది 3
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: అశ్విన్‌ బాబు, అవిక గోర్‌, అలీ, ఊర్వశి, బ్రహ్మాజీ, అజయ్‌ ఘోష్‌, ప్రభాస్‌ శ్రీను, ధన్‌రాజ్‌, హరితేజ, గెటప్‌ శ్రీను తదితరులు
మాటలు: సాయి మాధవ్‌ బుర్ర
సంగీతం: షబ్బీర్‌
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు
నిర్మాత, దర్శకత్వం: ఓంకార్‌
విడుదల తేదీ: అక్టోబర్‌ 18, 2019
'రాజుగారి గది' మాస్‌ని మెప్పించిన కామెడీతో విజయవంతమయితే, 'రాజుగారి గది 2'కి ఆ కామెడీ లేక, స్టార్స్‌ వున్నా కానీ క్లిక్‌ అవలేదు. దీంతో 'రాజుగారి గది'ని మూడోసారి చూపించేటపుడు మొదటిసారి వున్న కామెడీకి మించిన హాస్యాన్ని జోడించాలనే ఆరాటంలో హాస్యానికీ, అపహాస్యానికీ వున్న తేడాని తెలుసుకోలేకపోయారు. అపానవాయువుతో దెయ్యాలని వెళ్లగొట్టడం, మల విసర్జన చేసి భూమి నుంచి బయటకు వచ్చిన భూతం చేతితో కడుక్కోవడం, భారీ ఆకారం గల పెద్ద మనిషి దెయ్యాలని చూసి పంచె తడుపుకోవడం లాంటి సన్నివేశాలు చూసి మీకు నవ్వొస్తుందనుకుంటే, ఈ రాజుగారి గది అచ్చంగా మీ దర్శనానికే! ఇక్కడ చాలా మందికి చదవడానికే ఇబ్బందిగా అనిపించే ఇలాంటి వాటిని ఎన్నోసార్లు డ్రాఫ్ట్‌ చేసుకుని, షాట్‌ డివిజన్‌ చేసి, తెర మీదకి ఎక్కించి, ఎడిట్‌ చేసి, థియేటర్లలోకి పంపించారంటే ఈ మేకర్స్‌ తాలూకు సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఏ పాటిదో అర్థమయ్యే వుండాలి.

దెయ్యాలని చూసి భయపడడాలు, పరుగెత్తడాలు నవ్వించే లెవల్‌ని దాటి చిరాకు పెట్టించే స్థాయికి జనాల నెత్తిన రుద్ది, రుద్ది పారేసారు. ఈ ఫార్ములాని కాచి వడపోసిన లారెన్స్‌ కూడా తన 'కాంచన' సిరీస్‌లో వచ్చిన చివరి చిత్రంలో నవ్వించలేక నానా యాతన పడ్డాడు. ఓంకార్‌ తన జోకులకి జనాన్ని నవ్వించే సత్తా వుందని నమ్మి, తమిళం నుంచి 'దిల్లుకు దుడ్డు 2' అనే చిత్రం నుంచి ఈ కథని అరువు తెచ్చుకున్నాడు. తీసేదేదో పూర్తి స్థాయి హారర్‌ కామెడీనే తీయకుండా తన తమ్ముడిని తొంభైల కాలం నాటి మాస్‌ హీరోగా చూపించడానికి విశ్వ ప్రయత్నం చేసాడు. అంత బిల్డప్‌లిచ్చిన సదరు క్యారెక్టర్‌ ఇందులోకి ఫిట్‌ కాక అవస్థలు పడి, చివరకు ద్వితియార్ధంలో మిగతా కామెడీ గ్యాంగ్‌లో కలిసిపోయింది. అయితే అశ్విన్‌లో పవన్‌కళ్యాణ్‌ని చూపించే ప్రయత్నంలో ఒక ఫైట్‌, మూడు పాటలు, బోలెడంత ఖర్చు వృధా అయ్యాయి.

ఇంతకీ కథేమిటంటే... ఒక లేడీ డాక్టర్‌కి ఎవరు ఐ లవ్యూ చెప్పినా, ఎవరైనా ఆమెకి కాస్త దగ్గరగా వచ్చినా ఒక అదృశ్య శక్తి వారిని భయపెట్టి తరిమేస్తుంటుంది. ఆమెని ప్రేమించిన ఆటోడ్రైవర్‌ తన వెనక రహస్యాన్ని చేధించడానికి కేరళ వెళితే, తనని కాపాడే శక్తిని తరిమి కొట్టే తాళపత్రాలు ఒక రాజుగారి భవంతిలో వున్నాయని తెలుస్తుంది. దాంతో ఆ దెయ్యాల బంగ్లాలోకి అతనితో పాటు మిగతా కామెడీ గ్యాంగ్‌ దిగుతారు. హారర్‌ కామెడీలో హారర్‌ మరుగున పడి కామెడీతో నెట్టుకురావడం చాలా కాలంగా జరుగుతోంది. కాకపోతే కాస్తయినా థ్రిల్‌ ఇవ్వడం, కొద్దిగా అయినా ఎంగేజ్‌ చేయడం చేస్తున్నారు. కానీ రాజుగారి గది 3లో అసలు అలా ఎంగేజ్‌ చేసే ప్రయత్నం కానీ, భయపెట్టే సందర్భాలు కానీ లేకపోవడంతో బలవంతపు కామెడీ మీద డిపెండ్‌ అయ్యారు.

తెర నిండా దెయ్యాల ఆకారాలు, చెవుల తుప్పు వదిలించే సౌండ్‌ ఎఫెక్టులు ఎన్ని వున్నా కానీ కాస్త కూడా ఆసక్తి రేకెత్తించకపోగా, ఒక దశ దాటాక విసుగెత్తిపోతుంది. తన మాటలు చోటు లేని ఈ సన్నివేశాలలో తన ఉనికి చాటుకోవడం కోసం బుర్రా సాయిమాధవ్‌ చేసిన ప్రయత్నం ఆయన పట్ల సానుభూతిని కలిగిస్తుంది. అక్కడికీ ఇలాంటి పిప్పిలో కూడా ఆయన ఇంటిలిజెంట్‌ జోక్‌ ఒకటి వేయగలిగారు. దెయ్యాలతో పాటుగా మేకప్‌ వేసుకుని కలిసిపోయిన ఊర్వశి, అజయ్‌ ఘోష్‌లని చూసి, మిగతా దెయ్యాలు అనుమాన పడి వాళ్లని టెస్ట్‌ చేయడానికి మూసి వున్న తలుపులలో నుంచి అటు వైపుకి వెళ్లిపోయి... 'మీరూ అలా రండి' అన్నట్టు పిలుస్తాయి. అప్పుడు ఊర్వశి ''మనం దెయ్యాలమో కాదోనని తెలుసుకోవడానికి 'ఎంట్రన్స్‌ టెస్ట్‌' పెట్టాయి'' అనడం నవ్విస్తుంది. కొన్ని విజువల్‌ కామెడీ ఘటనలు కూడా నవ్వించగలిగినా ఆ ఒకటీ అరా కితకితల కోసమని మిగతా నాన్సెన్స్‌ అంతా భరించడం కష్టమవుతుంది.

సింగిల్‌ పేజీలోను సగానికి పైగా పేజీ మిగిలిపోయేంత మేటర్‌ వున్న ఈ స్టోరీని రెండు గంటల పాటు నడిపించడం కూడా కష్టమయింది. అందుకే ఫస్ట్‌ హాఫ్‌ అంతా రిపీట్‌ సన్నివేశాలు, అవసరం లేని పాటలతో ఇంటర్వెల్‌ వరకు పొద్దు పుచ్చేసారు. ఈ స్టఫ్‌ని క్లాస్‌ ఎలాగో ఛీ కొడతారని తెలుసన్నట్టు ఎలాగయినా సి సెంటర్స్‌లో అయినా చిల్లర రాబట్టాలన్నట్టు ఒక దారుణమైన 'ఐటెమ్‌ సాంగ్‌' పెట్టారు. రికార్డింగ్‌ డాన్సులని తలపించేలా వున్న ఆ తంతుని అలాంటి టేస్టున్న వాళ్లే ఎంజాయ్‌ చేయాలి. ఇక ద్వితియార్ధంలో కామెడీ చేయడమొక్కటే ఈ రాజుగారి గది బూజు వదిలించగలదన్నట్టు ఒకే సన్నివేశాన్ని సుదీర్ఘంగా నలభై నిమిషాల పాటు సాగదీసారు. ఈ సన్నివేశంలోనే మీ టిక్కెట్టుకి సరిపడా వినోదం వెతుక్కోండన్నట్టు పాచిపోయిన సన్నివేశాలకి తోడు, ముందుగా చెప్పుకున్న ఆ దుర్భర హాస్య సన్నివేశాలు కూడా పడేసారు.

రాజుగారి గది కంటే నిర్మాణ పరంగా క్వాలిటీ మెయింటైన్‌ చేయాలని చూసిన ఓంకార్‌ అదే క్వాలిటీ కాంటెంట్‌లో వుండేట్టు చూసుకోలేకపోయాడు. ఇలాంటి హాస్యాన్ని జబర్దస్త్‌లో చేసినా కానీ ఛానల్‌ మార్చేస్తారని టీవీ ఆడియన్స్‌ పల్స్‌ తెలిసిన ఓంకార్‌కి అర్థం కాకపోవడం శోచనీయం. లేదా తెలుగు సినిమా మాస్‌ ఆడియన్స్‌ మేథస్సు, అభిరుచిపై బహుశా ఇదే అతని అభిప్రాయం. ఆటో నడిపిన ప్రతి వాడూ ఆటో జానీ కాలేడన్నట్టు... లుంగీ కట్టిన ప్రతి హీరో మాస్‌ హీరో అయిపోడని అశ్విన్‌ తెలుసుకోవాలి. తనకు మాలిన ఫీట్లు మాని, సెకండ్‌ హాఫ్‌లో మాదిరిగా కామెడీ బృందం మాటున నక్కిపోయి నెట్టుకొచ్చేయడానికే చూస్తుండాలి. అలీ, ఊర్వశి తదితరులంతా రెగ్యులర్‌గా ఇలాంటి సినిమాలలో చూపించే సన్నివేశాలతోనే నవ్వించాలని చూసారు తప్ప తమ వైపునుంచి ఎలాంటి కొత్తదనం తీసుకురాలేదు.

ఈ చిన్న సినిమాకి క్వాలిటీ విజువల్స్‌ని చోటా కె. నాయుడు అందించినా కానీ ఆయన అంత అనుభవం, సామర్ధ్యం ఈ గదికి అవసరం లేదు. మాస్‌కి ఇదే నచ్చుతుందంటూ ప్రేక్షకుల సెన్సిబులిటీస్‌ని, ఇంటిలిజెన్స్‌ని, సెన్సాఫ్‌ హ్యూమర్‌ని ఇన్సల్ట్‌ చేసే ఈ రాజుగారి గది3 కూడా సర్వయివ్‌ అయి సేఫ్‌ అయితే ఓంకార్‌ని అనుకుని లాభం లేదు. ఇలాంటి హాస్యానికి కూడా నవ్వొచ్చిన వారంతా రాజుగారి గది పునర్దర్శనానికి వేచి చూడవచ్చు.
బాటమ్‌ లైన్‌: చీప్‌ కామెడీ!
-గణేష్‌ రావూరి

సినిమా రివ్యూ: చాణక్య     సినిమా రివ్యూ: ఆర్‌డిఎక్స్‌ లవ్‌