సినిమా రివ్యూ: ఆర్‌డిఎక్స్‌ లవ్‌

సమీక్ష: ఆర్‌డిఎక్స్‌ లవ్‌ రేటింగ్‌: 1/5 బ్యానర్‌: హ్యాపీ మూవీస్‌, సికె సినిమాస్‌ తారాగణం: పాయల్‌ రాజ్‌పుట్‌, తేజస్‌ కంచర్ల, నరేష్‌, ఆదిత్య మీనన్‌, ముమైత్‌ ఖాన్‌, తులసి, ఆమని, నాగినీడు, విద్యుల్లేఖ రామన్‌…

సమీక్ష: ఆర్‌డిఎక్స్‌ లవ్‌
రేటింగ్‌: 1/5
బ్యానర్‌: హ్యాపీ మూవీస్‌, సికె సినిమాస్‌
తారాగణం: పాయల్‌ రాజ్‌పుట్‌, తేజస్‌ కంచర్ల, నరేష్‌, ఆదిత్య మీనన్‌, ముమైత్‌ ఖాన్‌, తులసి, ఆమని, నాగినీడు, విద్యుల్లేఖ రామన్‌ తదితరులు
సంగీతం: రధన్‌
కూర్పు: ప్రవీణ్‌ పుడి
ఛాయాగ్రహణం: సి. రామ్‌ ప్రసాద్‌
నిర్మాత: సి. కళ్యాణ్‌
కథ, కథనం, దర్శకత్వం: శంకర్‌ భాను
విడుదల తేదీ: అక్టోబర్‌ 11, 2019
'ఆర్‌ఎక్స్‌ 100' హిట్టయింది కాబట్టి… దీని టైటిల్‌ 'ఆర్‌డిఎక్స్‌ లవ్‌' అని పెడదామని ఫిక్స్‌ అయిన చిత్రంలో ఇక క్రియేటివిటీకి గానీ, సెన్సిబులిటీస్‌కి గానీ చోటెక్కడుంటుంది? హీరో పరిచయం అవుతూనే… 'నాకు తెలీకుండా ఫిగర్‌ని తెచ్చుకుంటార్రా? ఇప్పటికే నాలుగుసార్లు తెచ్చుకున్నారు' అంటూ నడి రోడ్డు మీద నిలబడి అరుస్తూ వుంటాడు. అంత సద్గుణం వున్న హీరో పరిచయం అయిన తర్వాత ఇక ఈ చిత్రంలో సుగుణాలుంటాయని ఎవరు మాత్రం ఎందుకు అనుకుంటారు? హీరోయిన్‌ పరిచయం అవుతూనే 'సేఫ్‌ సెక్స్‌'ని ప్రబోధిస్తూ కాండమ్స్‌ పంచిపెడుతూ వుంటుంది. 'సేఫ్టీలు' అంటూ చాలా నేస్టీగా 'కాండమ్స్‌'ని సంబోధించే ఆమె సోషల్‌ సర్వీస్‌ కోసం ఏ ఎండ్‌కయినా వెళ్లిపోతుంది.

ఆమెతో పరిచయం పెంచుకోవడం కోసమని అర్థరాత్రి ఆమె హాస్టల్‌కి వచ్చి 'సేఫ్టీలు' కావాలని అడిగితే తన దగ్గర లేవంటూ బైక్‌ ఎక్కించుకుని తన బాస్‌ దగ్గరకి తీసుకెళ్లిపోయి ప్యాకెట్‌ ఇప్పిస్తుంది. మర్నాడు అతని గాళ్‌ఫ్రెండ్‌ని కలిసి సేఫ్‌ సెక్స్‌ గురించిన క్లాస్‌ ఇచ్చి ఆమెకి కూడా కొన్ని కాండమ్స్‌ ఇస్తుంది. ఈ సన్నివేశాలన్నీ హీరో ఆమెతో పరిచయం పెంచుకోవడానికి చేసిన ప్రయత్నాలని సరిపెట్టుకోవాలి. ఇంత దిక్కుమాలిన పద్ధతిలో ప్రేమించిన అమ్మాయికి దగ్గర కావాలనే బుద్ధిలేనోళ్లు ఎక్కడుంటారో మరి? ఈ సేఫ్టీల గొడవ ముగిసిన తర్వాత ఒక ఊరిలో చాలా కాలంగా సంతానం లేదని తెలుసుకుని కారణాలు వెతుక్కుంటూ అక్కడికి వెళుతుంది మన సంఘ సేవకి.

మగాళ్లు మద్యానికి అలవాటు పడి సంసారం చేయడం లేదని తెలిసి వారిని దారికి తెచ్చుకునే ట్రిక్కులు నేర్పిస్తుంది. ఆమె ఎత్తులు పారకపోవడంతో మన హీరో వాళ్లకి వాత్సాయన కామసూత్ర గురించి తెలియజేసి, మీ మొగుళ్లు మీ దారికి రాకపోతే మీరే వాళ్లని దారికి తెచ్చుకోండని చెప్పడంతో ఆ ఊరంతా వేవిళ్లు మొదలవుతాయి. మరోచోట గుట్కా మాన్పించడం కోసం ఆ ఏరియా దాదాకి ముద్దు రుచి చూపించి గుట్కాని నిషేధించేలా చేస్తుంది. అసలు ఇదంతా దేనికి చేస్తోందంటే… ఇలాంటి సంఘ సేవ చేస్తూ మీడియాలోకెక్కి ముఖ్యమంత్రి దృష్టిలో పడాలని చెబుతుంది. ఎందుకూ అంటే, తమ ఊరికి వంతెన లేదని, అంచేత ముఖ్యమంత్రిని కలిసి దాని గురించి మాట్లాడడం కోసం ఇలా సోషల్‌ సర్వీస్‌ చేస్తున్నానంటుంది.

ఎటు పోతుందో అర్థంకాని, అసలు అర్థం లేని ఈ చిత్రం సడన్‌గా ఇంకో టర్న్‌ తీసుకుంటుంది. ఈసారి ఒక ఆడ పోలీస్‌ రంగంలోకి దిగి హీరోయిన్ని 'గింజ' అని పదే పదే తిడుతూ చావచితగ్గొడుతుంది. ఎందుకూ అంటే ఆమె వెంట పడుతోన్న హీరో ఎవరో పలుకుబడి వున్న వ్యక్తి కొడుకు కాబట్టి. హీరో తండ్రి ఒక ఛానల్‌ అధిపతి. తన కొడుకు జోలికి రాకుండా వుండమని గట్టిగా వార్నింగ్‌ ఇవ్వాల్సినది పోయి… వస్తాదులతో కబడ్డీ ఆడమని, గెలిస్తే కొన్నాళ్లు బతకనిస్తానని అంటాడు! ఏమిటీ పిచ్చితనం అని మనకి అనిపించిన ప్రతిసారీ దానికి మించిన ఘోరం తెరపైకి తీసుకొస్తుంటారు.

హీరోని తనతో పాటు తీసుకుపోయి అతను తనని ముద్దు పెట్టుకునేది, స్నానం చేయించేది వీడియోలు తీసి అతని తండ్రికే పంపిస్తుంటుంది. అందులో లాజిక్‌ ఏమిటనేది దర్శకుడికే తెలియాలి. హీరోయిన్‌ చేసేదే ఛండాలంగా అనిపిస్తూ వుంటే, ఆమె స్నేహితురాళ్లు అంతకుమించిన లేకితనంతో మాట్లాడుతూ జీవితం మీద విరక్తి తెప్పిస్తుంటారు. మీ ఊరికి వంతెన కావాలంటే నువ్వు చచ్చిపోవాలని హీరో తండ్రి కోరడంతో ఆమె సరేననడంతో ఈ ఆర్‌డిఎక్స్‌ లవ్‌ని ఒక కొలిక్కి తెస్తారు. మూర్ఖత్వానికి పరాకాష్ట అన్నట్టుగా, కేవలం పాయల్‌ రాజ్‌పుట్‌కి వున్న 'ఆర్‌ఎక్స్‌ 100' ఇమేజ్‌ని క్యాష్‌ చేసుకోవాలని చేసిన ఈ పైత్యపు యత్నం గురించి ఎంత చెప్పినా ఇంకా చాలా పైత్యం మిగిలి వుంటుంది.

ఎంత బూతు పెడితే అంత రాబడి అనుకున్నపుడు కనీసం దానికి కట్టుబడితే టార్గెట్‌ ఆడియన్స్‌నుంచి అయినా ఆదరణ దక్కుతుంది. మళ్లీ ప్రతి బూతు పురాణానికి వెనకో నీతి సందేశం, సమాజ హితం అంటూ కలర్‌ ఇస్తేనే ఛీత్కారం డబుల్‌ అవుతుంది. పాయల్‌ రాజ్‌పుట్‌ తన ప్రధాన కర్తవ్యం అందాల ప్రదర్శనే అన్నట్టుగా అదే పని మీదుండిపోయింది. పాయల్‌ ఇవన్నీ చేయడానికొక తోడుండాలి కనుక ఆ ఛాన్స్‌ తేజస్‌కి దక్కింది. ఆదిత్య మీనన్‌కి మెయిన్‌ విలన్‌గా చేసే అవకాశం రావడంతో ఆనందం పట్టలేక అవసరానికి మించి నటించేసాడు. ముమైత్‌ఖాన్‌ చాలా కాలానికి దక్కిన చిన్న వేషంలో తనని గుర్తు పడతారో లేదోనని అసలు మళ్లీ తనని మరచిపోనివ్వకుండా రెచ్చిపోయింది.

హీరోయిన్‌ స్నేహితురాళ్లుగా నటించిన అమ్మాయిలందరూ మాట్లాడే మాటలు చూసి వారిపై జాలి కలుగుతుంది. పాయల్‌ కోసమే పెట్టిన పాటలలో ఆమె ఆర్‌డిఎక్స్‌లా పేలింది. తనని చూడ్డానికి మాత్రమే వచ్చేవారికి పూర్తి పైసా వసూల్‌ ఇవ్వాలనే పంతం ఆమెలో కనిపించింది. ఎలాంటి అంశాలు పెడితే ఈజీగా కాసులు రాలుతున్నాయని చూసుకుని మరీ ఈ ప్రయత్నం చేసారు కానీ, అలా డబ్బులు రాబట్టడానికి కూడా ఒక పద్ధతీ, పాడూ వుంటాయనేది దీనితో బోధపడే నీతి.
బాటమ్‌ లైన్‌: హారిబుల్‌ లవ్‌!
-గణేష్‌ రావూరి

సినిమా రివ్యూ: సైరా      సినిమా రివ్యూ: చాణక్య