cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: చాణక్య

సమీక్ష: చాణక్య
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: గోపిచంద్‌, మెహ్రీన్‌, ఉపేన్‌ పటేల్‌, జరీన్‌ ఖాన్‌, నాజర్‌, సునీల్‌, రాజేష్‌ ఖత్తర్‌, అలీ, ఆదర్శ్‌, రాజా, కల్పన తదితరులు
మాటలు: అబ్బూరి రవి
స్వరకల్పన: విశాల్‌ చంద్రశేఖర్‌
నేపథ్య సంగీతం: శ్రీచరణ్‌ పాకల
కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
ఛాయాగ్రహణం: వెట్రి పళనిసామి
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
కథ, కథనం, దర్శకత్వం: తిరు
విడుదల తేదీ: అక్టోబర్‌ 5, 2019
''ఈ కెమెరాలు సరిపోవు. అతడిని ట్రాక్‌ చేయడానికి నాకు ఇంకా చాలా కెమెరాస్‌ కావాలి'' అంటాడు హీరో. ''డన్‌'' అంటూ ఒక లేడీ ఏజెంట్‌ వెళ్లి ఊరంతా కెమెరాలు 'అంటించి' వచ్చేస్తుంది... అమీర్‌పేటలో పాంప్లెట్లు పంచినట్టుగా! ''అతని వేలి ముద్రలు కావాలి'' అనగానే ''అది నాకు వదిలెయ్‌' అంటూ అదే లేడీ ఏజెంట్‌ బార్‌కి వెళ్లి అతడి వేలి ముద్రలు ఏదో డివైస్‌తో స్కాన్‌ చేసి దానిని 'ఆన్‌లైన్‌లో' హీరోకి పంపించేస్తుంది. అతను దాంతో ఫింగర్‌ప్రింట్‌ ఎనేబుల్డ్‌ సెక్యూరిటీ రూమ్‌లోకి యాక్సెస్‌ సాధించేస్తాడు. అతని వాయిస్‌ కమాండ్‌ కావాలి అని ఫోన్లో అడిగినపుడు అది కూడా చేసేస్తుంది ఆ లేడీ ఏజెంట్‌.

మరో సందర్భంలో ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ని వాష్‌రూమ్‌లో కిడ్నాప్‌ చేయాలని హీరో ప్లాన్‌ చేస్తాడు. అది కూడా సదరు లేడీ ఏజెంటే చేయాలి. అది చేయడంలో అతనికి వచ్చే ఏకైక డౌట్‌... 'అతడిని ఎత్తగలవా?' అని. దాంతో ఆమె మన హీరోనే ఎత్తి చూపిస్తుంది. దాంతో అతను కన్విన్స్‌ అయిపోతాడు. ఇదంతా చేసేది రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) ఏజెంట్స్‌ కాగా, ఇదంతా జరిగేది అక్కడా, ఇక్కడా కాదు... ఏకంగా పాకిస్తాన్‌లో.

పై సన్నివేశాలు చదివితే ఈ స్పై థ్రిల్లర్‌ని ఎంత సీరియస్‌గా తీసుకోవాలనేది మీకు బోధపడే వుండాలి. మొదటి సన్నివేశంలోనే కార్‌లో రోడ్‌ మీద వెళుతోన్న టెర్రరిస్ట్‌ని పట్టుకోవడానికి కాచుకుని కూర్చున్న ఇండియన్‌ రా ఏజెంట్లు, అతను మాస్క్‌ ధరించి వుండడం వల్ల రిస్క్‌ చేయలేక వదిలేస్తారు. దాంతో హీరో ప్లాన్‌ బి అంటాడు. అదేమిటంటే సరాసరి అతను వెళ్లిన ఇంట్లోకి వెళ్లి అక్కడున్న వారందరినీ చంపేసి ఆ టెర్రరిస్టుని పట్టుకోవడం. అదేదో కార్‌లో వుండగానే చేయవచ్చుగా అంటే, ఆ ముసుగు వేసుకున్నది అతడేనా, కాదా అనేది డౌట్‌ అట.

అందుకని చాలా రిస్క్‌ అట. మరి లోపలికి వెళ్లాక అంతమందిని చంపేసి, మన ఏజెంట్ల ప్రాణాలని కూడా రిస్కులోకి పెట్టి, తీరా పట్టుకున్నాక ఆ ముసుగు వీరుడు వీళ్లు వెతుకుతున్న టెర్రరిస్ట్‌ కాకపోతే రిస్క్‌ కాదా? పాకిస్తానీ ఆర్మీ వచ్చి వీళ్లని వెంబడించినా కానీ ఓపెన్‌ టాప్‌ జీప్‌లో ఒకే ఒకరికి కాలి మీద అయిన గాయంతో అక్కడ్నుంచి బయట పడిపోతారు. సదరు సన్నివేశం ఆ తర్వాత ఈ ఏజెంట్లు చేయబోయే ఘనకార్యాలు ఎలా వుండబోతున్నాయనే దానిని రుచి చూపించి ముగుస్తుంది. అందుకు ఏమాత్రం తగ్గకుండా ముందుగా చెప్పుకున్న పనులన్నీ ఆ తర్వాత మిషన్‌లో హీరో చేయడంతో సినిమా ముగుస్తుంది.

కానీ గోపిచంద్‌ హీరో కనుక సగటు స్పై థ్రిల్లర్‌లా మిషన్లు, మెషీన్‌ గన్లు మాత్రమే వుంటే ఎట్టా? అందుకని మధ్యలో అతనో అండర్‌ కవర్‌ బ్యాంక్‌ ఉద్యోగిగా కనిపిస్తాడు. ఇక్కడ హీరోయిన్‌ ఎంటర్‌ అవుతుంది. వీరి మధ్య కెమిస్ట్రీ ఏదో ఎస్టాబ్లిష్‌ చేస్తారనుకుంటే కుక్కల మేటింగ్‌ టాపిక్‌ని అత్యంత జుగుప్సాకరంగా వర్ణిస్తూ అదే కామెడీ అని ఫీలయ్యారు. కుక్కల మేటింగ్‌ జరిగే నాటికి హీరో హీరోయిన్లు ప్రేమలో పడతారు. ఈలోగా మళ్లీ టెర్రరిస్టులు ఎంటర్‌ అయితే, తన టీమ్‌ మేట్స్‌ని పట్టుకుపోయిన వారి కోసం హీరో పాకిస్తాన్‌ వెళతాడు. వెళతాడు, వెళ్లి ఒక లేడీ ఏజెంట్‌ సాయంతో పైన చెప్పినవన్నీ చేస్తాడు.

అత్యంత చాకచక్యంగా ఇండియాతో పాటు వివిధ దేశాలలో భయంకరమైన దాడులు చేసే టెర్రరిస్టులని బురిడీ కొట్టించి మన హీరో చూపించే 'చాణక్యం' చూస్తే అన్ని దాడులు చేయనిచ్చిన ఇండియన్‌ ఆర్మీని, అమెరికన్‌ ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీలకి ఈ సినిమా చూపించాలనిపిస్తుంది. ఇలాంటి సినిమాలకి పెద్ద బడ్జెట్‌ ఇస్తే 'ఏక్‌ థా టైగర్‌'లా బ్రహ్మాండంగా తీసి వుండేవాళ్లమని సాకులు చెప్పుకునే వీలుండేది... గూఢచారి రాకపోతే. ఇంతకంటే చాలా తక్కువ బడ్జెట్‌లో అంత మంచి థ్రిల్లింగ్‌ స్పై థ్రిల్లర్‌ తీసిన అడివి శేష్‌ బృందం ఇలాంటి చిత్రాలకి కావాల్సిన కథ, కథనాలు ఎంత పకడ్బందీగా వుండాలో చూపించింది.

కానీ తెలివితేటలు, మలుపులతో కూడిన కథ, కథనాల కంటే మసాలా అంశాలు మస్ట్‌గా వుండాలని తిరు ఫీలయ్యాడు. అందుకే అంత సీరియస్‌ మిషన్‌ మధ్యలో వున్న హీరోతో కూడా డ్యూయెట్‌ పాడించాడు. అఫ్‌కోర్స్‌ డ్రీమ్‌లో అనుకోండి. కాకపోతే అప్పుడో సాంగ్‌కి బ్రేక్‌ తీసుకునే వీలుందనిపించడమే గొప్ప విషయం. అలాగే ఈ స్పై థ్రిల్లర్‌లోకి కుక్కల కామెడీ పెట్టే స్పేస్‌ క్రియేట్‌ చేసుకోవడమూ మెచ్చుకోవాల్సిన అంశం. అభినయ పరంగా గోపిచంద్‌ ఒక్కడే కాస్త ఎఫర్ట్‌ పెట్టినట్టు అనిపించాడు. హీరోయిన్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

ముఖ్యంగా జరీన్‌ ఖాన్‌ గురించి. డాషింగ్‌ అండ్‌ డైనమిక్‌ ఏజెంట్‌లా అనిపించాల్సిన ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ అయితే న భూతో న భవిష్యతి. క్లూలెస్‌ అనే పదానికి హ్యూమన్‌ డెఫినిషన్‌లా కనిపించింది. ఈ తరహా చిత్రాలకి అవసరమైన సాంకేతికత కూడా 'చాణక్య'లో లోపించింది. తెర వెనుక ఏ డిపార్ట్‌మెంట్‌ నుంచి స్టాండ్‌ అవుట్‌ అవుట్‌పుట్‌ అయితే రాలేదనే చెప్పాలి. ఖర్చు పెట్టినా కానీ యాక్షన్‌ సన్నివేశాలలో కూడా థ్రిల్‌ లోపించింది. ఒకటీ అరా దృశ్యాలలో చూపించిన తెలివితేటలు మినహా దర్శకుడు తిరు ఒక సగటు స్పై థ్రిల్లర్‌కి కావాల్సిన థ్రిల్లింగ్‌ స్క్రీన్‌ప్లే రాసుకోలేకపోయాడు.

పాకిస్తాన్‌కి వెళ్లి ఒక రెస్క్యూ ఆపరేషన్‌ చేయడమనే ప్లాట్‌లో వున్న ఎక్సయిట్‌మెంట్‌ స్క్రీన్‌పైన ఎగ్జిక్యూషన్‌లో కనిపించలేదు. ప్రొడక్షన్‌ డిజైన్‌ పరంగా లుక్‌ అయితే రాబట్టారు కానీ ఆసక్తిగా వీక్షించే దృశ్యాలని మలచలేకపోయారు. సగటు మాస్‌ చిత్రాన్ని ఆశించినట్టయితే ఎలా అనిపిస్తుందో కానీ, యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌కి మాత్రం జస్టిస్‌ చేయలేక 'చాణక్య' చతికిలపడ్డాడు.
బాటమ్‌ లైన్‌: ఇదేమి 'రా'?!
- గణేష్‌ రావూరి

సినిమా రివ్యూ: సైరా      సినిమా రివ్యూ: బందోబస్త్‌