సమీక్ష: బందోబస్త్
రేటింగ్: 2/5
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
తారాగణం: సూర్య, మోహన్‌లాల్, సయ్యేషా, ఆర్య, బొమన్ ఇరాని, చిరాగ్ జాని, సముద్రఖని, పూర్ణ, తలైవాసల్ విజయ్ తదితరులు
కూర్పు: ఆంటోని
సంగీతం: హారిస్ జైరాజ్
ఛాయాగ్రహణం: ఎం.ఎస్. ప్రభు
నిర్మాత: సుబాస్కరన్
రచన, దర్శకత్వం: కె.వి. ఆనంద్
విడుదల తేదీ: సెప్టెంబర్ 20, 2019
ఒక సన్నివేశంలో ప్రధానమంత్రి ఉదయమే వ్యాహ్యాళికి వెళ్లి, తన బందోబస్త్‌తో కాసేపు సరదా కబుర్లాడి, కుటుంబంతో ముచ్చటిస్తోన్న టైమ్‌లో టీవీలో న్యూస్ వస్తుంది… పాకిస్తానీ తీవ్రవాదులు భారత సైనిక శిబిరంపై దాడి చేసి ఇరవై మంది సైనికుల తలలు నరికి చంపేసారని. 'ఇదెప్పుడు జరిగింది' అని తన సిబ్బందిని అడిగితే 'ఇవాళ ఉదయమే జరిగింది సర్. మీకు చెప్పలేదు' అని సమాధానమిస్తారు… ఏదో గుండెపోటు తండ్రికి చుట్టాలు ఎవరో చనిపోయిన బ్యాడ్ న్యూస్ గభాల్న చెప్పరాదన్నట్టు. ఇలాంటి సన్నివేశాలని ఎంత సీరియస్‌గా తీసుకుంటారనే దానిని బట్టి ఈ బందోబస్త్‌ని ఎంజాయ్ చేయగలరా లేదా అనేది ఆధారపడి వుంటుంది. ఎందుకంటే ఇలాంటి సన్నివేశాలు ఇందులో కొల్లలుగా వుంటాయి.
మరో సీన్‌లో… ప్రధానమంత్రిపై ఎటాక్ చేసిన తీవ్రవాదిని చూసి అతడిని వెంబడిస్తుంటాడు హీరో. ఇతనే తీవ్రవాది అని పొరబడి హీరోయిన్ ఇతడిని వెంటాడుతుంది. టెర్రరిస్ట్‌ని పట్టుకోవాల్సిన వాడు కాస్తా మందు తాగి ఆమెతో కామెడీతో కూడిన రొమాన్స్ లాంటిది చేస్తాడు. మర్నాడు దానికి ఎక్స్‌టెన్షన్ కూడా వుంటుంది… రాత్రి మన మధ్య ఏమీ జరగలేదు కదా అంటూ! ప్రధానమంత్రి భద్రత, తీవ్రవాదం, బయో వార్ లాంటి సీరియస్ టాపిక్స్‌ని, అందుకు సంబంధించిన యాక్షన్‌ని చూపిస్తూ కూడా ఇలాంటి సిల్లీ సీన్స్‌ని 'కమర్షియల్ అవసరాల' పేరుతో చొప్పిస్తే ఇక ఆ సినిమాని ఎలా సీరియస్‌గా తీసుకోగలరు?
ఇటీవల స్టార్ హీరోల కమర్షియల్ చిత్రాలనగానే రైతుల సమస్యలని మాట్లాడడం, వారికి సాయం చేయాలంటూ ఉపన్యాసాలు దంచి కొట్టడం రెగ్యులర్ పాయింట్ అయిపోయింది. ఇంత పెద్ద యాక్షన్ సినిమా తీస్తూ రైతుల బాధలు, వ్యవసాయం గురించి మాట్లాడకపోతే పెద్ద సినిమా కాదంటారేమోననే భయంతో ఆ పాయింట్లని కూడా ఇందులోకి ఇరికించారు. అయితే కారణం లేకుండా రైతులు అంటే బాగోదని హీరోనే రైతుగా చూపిస్తారు. రైతుగా పరిచయమయి కంపోస్ట్ ఎరువుల గురించి లెక్చర్లు దంచుతోన్న సదరు కథానాయకుడే కాసేపటికి ప్రధానమంత్రిని ఒక తీవ్రవాద దాడి నుంచి రక్షిస్తాడు. మిలటరీ అధికారి అయిన అతడిని ప్రధానమంత్రి రక్షకుడిగా నియమిస్తారు. 'ఒలింపస్ హాజ్ ఫాలెన్' తరహాలో ఏదైనా యాక్షన్ చిత్రం తీసారేమో అనే భ్రమపడేలోగా ఇంకా చాలా అంశాలు తెర మీదకి వస్తాయి. ఎప్పుడూ ఒక విషయంపై ఫోకస్ పెట్టని దర్శకుడు కె.వి. ఆనంద్ వివిధ విషయాలని ఒకేసారి తలకి ఎత్తుకుని 'తిమ్మిని బమ్మి' చేసే ప్రయత్నంలో భంగపడ్డాడు.
క్యారెక్టర్స్‌ని ఆడియన్స్ కేర్ చేయాలని, తద్వారా ఆ పాత్రలు చనిపోయినపుడు ఎమోషన్ పండుతుందని కొన్ని బలవంతపు సన్నివేశాలని ఇరికించారు. అయితే అలాంటి సన్నివేశాలు (సముద్రఖని-పూర్ణ లవ్‌స్టోరీ) లెంగ్త్ పెరగడానికి, మరింత బోర్ అనిపించడానికి దోహదపడ్డాయి. యాక్షన్ సన్నివేశాలు బాగున్నా కానీ అవి కూడా సుదీర్ఘంగా సాగుతుంటాయి. హీరోకి ఎక్కడా ఛాలెంజ్ కూడా ఎదురు కాదు. ఎంతమంది వస్తే అంతమందిని తన్నుకుంటూ పోవడమే. ఏదో ప్రధానమంత్రి రక్షణకి తానొక్కడే వున్నట్టుగా ప్రతి దానినీ ఇతనే పసిగడుతూ వుంటే మిగతా వాళ్లంతా చోద్యం చూస్తూ కనిపిస్తారు. బోలెడంత టాలెంట్ అందుబాటులో వున్నా కానీ దేనినీ ఉపయోగించుకోలేకపోవడం 'బందోబస్త్' ప్రత్యేకత. ఇంత పర్పస్ లేని క్యారెక్టర్‌ని మోహన్‌లాల్ ఎలా చేసారో మరి. బొమన్ ఇరాని కూడా క్యారికేచర్‌లానే కనిపిస్తాడు. ఆర్య, సముద్రఖని ఇద్దరూ వేస్టయ్యారు.
సూర్య తన పాత్రకి న్యాయం చేయడానికి, ఈ చిత్రాన్ని మోయడానికి శాయశక్తులా కృషి చేసినా కానీ ఎక్కడా సీరియస్‌గా తీసుకోనివ్వని ఈ కథ, కథనాలు అతని కష్టాన్ని వృధా చేసాయి. మోహన్‌లాల్ అయినా, మిగతా తారాగణం అయినా కేవలం ఫ్రేమ్‌కి నిండుదనాన్ని ఇవ్వడానికి, ఏదో జరుగుతోందనే భావన కల్పించడానికి మినహా చేయడానికి ఏమీ లేకపోయింది. సాంకేతికంగా ఛాయాగ్రహణం, కొన్ని ఫైట్ సీన్స్ మినహా మరేమీ ఆకట్టుకోలేదు. హారిస్ జైరాజ్ కనీసం ఒక్క ట్యూన్‌తో అయినా మునుపటి టాలెంట్‌ని గుర్తు చేయలేకపోయాడు.
ఒక మంచి థ్రిల్లింగ్ యాక్షన్ చిత్రం చేయడానికి తగ్గ సెటింగ్ పెట్టుకుని కూడా కమర్షియల్ అప్పీల్ పేరిట పక్క చూపులు చూస్తూ, అవసరం లేని విషయాలు ఎన్నెన్నో కలుపుకుంటూ పోవడం వల్ల కె.వి. ఆనంద్ ఈ చిత్రాన్ని బోరింగ్‌గా మార్చాడు. బయో వార్ అంటూ మధ్యలో చూపించిన సబ్ ప్లాట్ నేపథ్యంలో కానీ, ప్రధాని-రక్షణాధికారి నేపథ్యానికి కానీ కట్టుబడినట్టయితే ఒక ఉత్కంఠభరిత చిత్రం తెరకెక్కేది. కానీ ఎన్ని అంశాలు టచ్ చేస్తే అంతగా పరిశోధించినట్టు, అంతగా శ్రమ పడినట్టు భావిస్తారని అవసరం వున్నవీ, లేనివీ కలిపి కంగాళీ చేసేస్తే ఇదిగో ఇలాగే తల, తోక లేని యాక్షన్ కిచిడీ అవుతుంది.
రైతు సమస్యలకి సినిమాటిక్ పరిష్కారాలు ఇవ్వడం ఆపేసి, ఎమోషనల్ యాంగిల్ పేరుతో రైతు కష్టాలని పిండుకోవడం మానేసి, క్రియేటివ్ ఆలోచనలు సాగు చేస్తే కొత్త కథల దిగుబడికి ఆస్కారముంటుంది. అందాకా ఇలాంటి అరకొర ప్రయత్నాలు చేయడానికేమీ లేనప్పుడు అమెజాన్‌లో ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్‌లో చూసుకోవడానికి పనికొస్తాయి.
బాటమ్ లైన్: 'బందోబస్త్' బాగా వీక్!
– గణేష్ రావూరి