ఊహించని విధంగా చంద్రుని ఉపరితలంపై కుప్పకూలిన విక్రమ్ ల్యాండర్ తో సంబంధాలు నెలకొల్పడానికి ఇస్రోకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. రేపటికి ఇస్రో ఎలాంటి పురోగతి సాధించకపోతే ల్యాండర్ తో సంబంధాలు ఇక పూర్తిగా తెగిపోయినట్టే. ఎందుకంటే రేపట్నుంచి చంద్రుని దక్షిణ ప్రాంతంలో చీకట్లు అలుముకుంటాయి. మన కాలమానం ప్రకారం చూసుకుంటే.. మరో 14 రోజుల పాటు చంద్రుని దక్షిణదృవంపై చీకటి ఉంటుంది. సూర్యరశ్మి లేకపోతే ల్యాండర్ చార్జింగ్ అవ్వదు. సో.. ఈ రోజుల్లో తను నిల్వచేసుకున్న ఛార్జింగ్ ను గంటగంటకు ల్యాండర్ కోల్పోతుంది. ఇక ఆ తర్వాత దక్షిణ భాగంపైకి వెలుగు వచ్చినప్పటికీ ఉపయోగం ఉండదు.
అందుకే మిగిలిన ఈ కొద్ది గంటల్లోనే ల్యాండర్ తో సంబంధాలు పునరుద్ధరించేందుకు ఇస్రోకు చెందిన కమ్యూనికేషన్స్ టీమ్ తీవ్రంగా కృషిచేస్తోంది. చంద్రుడి ఉపరితలానికి సరిగ్గా 2.1కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ల్యాండర్ తో సంబంధాలు కోల్పోయింది ఇస్రో. ఆ తర్వాత ల్యాండర్ కూలిన ప్రదేశాన్ని గుర్తించింది. చంద్రుని కక్ష్యలో తిరుగుతున్న ఆర్టిటార్, విక్రమ్ ల్యాండర్ ఫొటోలు తీసింది. ల్యాండర్ ఓ పక్కకు ఒరిగిపోయి ఉందని, దాన్నుంచి సిగ్నల్స్ అందుకోవడం కష్టంగా ఉందని ఇస్రో ప్రకటించింది.
చంద్రునిపై రాత్రివేళల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కొన్నిసార్లు రాత్రివేళల్లో మైనస్ 150 డిగ్రీలకు కూడా టెంపరేచర్ పడిపోతుంది. కాబట్టి ల్యాండర్ పూర్తిగా చెడిపోయే అవకాశాలే ఎక్కువ. చంద్రుని మీద ఒక రోజు అంటే, భూమి మీద అది 14 రోజులతో సమానం. ఇలా చూసుకుంటే ల్యాండర్ తో కనెక్ట్ అవ్వడానికి రేపే చివరి అవకాశం. ఆ తర్వాత చంద్రుని దక్షిణ ప్రాంతాన్ని చీకట్లు కమ్మేస్తాయి.
ల్యాండర్ తో కమ్యూనికేషన్ లేకపోయినా చంద్రయాన్-2 సక్సెస్ అయినట్టే లెక్క. తమ మిషన్ దాదాపు 95శాతం సక్సెస్ అయిందని ఇస్రో ప్రకటించింది. చంద్రని కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఆర్బిటార్ ఎంతో విలువైన సమాచారాన్ని భూమికి చేరవేస్తుందని, ఇది భారత్ సాధించిన ఘనవిజయమని తెలిపింది ఇస్రో.
అంతేకాదు.. టెక్నికల్ గా ల్యాండింగ్ ఫెయిల్ అయినప్పటికీ.. చంద్రుని దక్షిణ ధృవంపైకి ల్యాండర్ ను ప్రయోగించిన తొలిదేశంగా భారత్ అవతరించింది. మొత్తంగా చూసుకుంటే అమెరికా, రష్యా, చైనా తర్వాత చంద్రునిపై ప్రయోగాలుచేసిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.